అడిగినంత ఇస్తే అంతస్తులు కు రైట్ రైట్
* శేరిలింగంపల్లిలో అక్రమ కట్టడాలకు ‘కాసుల’ వర్షం,
* యత్తేచగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు
* అక్రమ నిర్మాణాలపై ముందే హెచ్చరించిన విజయక్రాంతి కథనాలు
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మాదాపూర్ అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు బలికావడం కేవలం ఒక ప్రమాదం కాదు.. అధికారుల అవినీతి, రాజకీయ అండదండలతో జరుగుతున్న పక్కా ’హత్య’ అని బాధితులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. 30 నుంచి 50 గజాల చిన్న స్థలంలో, నాలాను కబ్జా చేసి ఏడంతస్తులు లేపుతుంటే కనీసం కన్నుత్తి చూడని టౌన్ ప్లానింగ్ విభాగం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అవినీతికి నిలయంగా శేరిలింగంపల్లి 48, 49 సర్కిళ్లు
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని 48, 49 సర్కిళ్ల టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై చాన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
‘మామూళ్ల’ రాజ్యం: "అడిగినంత ఇస్తే చాలు.. ఎన్ని అంతస్తులైనా లేపుకోండి, విచారణ వస్తే కొద్ది రోజులు పనులు నిలిపివేయండి" అనే చందంగా క్షేత్రస్థాయి అధికారుల తీరు మారిందనే విమర్శలు ఉన్నాయి.
బుట్టదాఖలవుతున్న ఫిర్యాదులు
ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలపై స్థానికులు ప్రజావాణిలో, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. తనిఖీల పేరిట హడావుడి చేయడం, ఆపై మౌనం వహించడం పరిపాటిగా మారింది. గతంలో దాసరి హరిచందన, రోనాల్డ్ రాస్ వంటి ఐఏఎస్ అధికారులు, ప్రస్తుతం సిఎంసి కమిషనర్ శ్రీజన, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ బాధ్యతల్లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు.
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై ప్రతిపక్షాల ధ్వజం
తాజా ప్రమాదం ఘటన పై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
నిబంధనలు ఉల్లంఘించిన భవన యజమానులు, పర్యవేక్షణలో విఫలమైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాల వెనుక అధికార యంత్రాంగంపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేదా ప్రజాప్రతినిధులకు కూడా ఇందులో వాటాలు అందుతున్నాయా? అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రాణాలు పోయాకే నిబంధనలు గుర్తుకొస్తాయా?
అంజయ్యనగర్ ఘటనపై బాధితులు, స్థానికులు తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగాక హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసులు రావడం, ప్రకటనలు గుప్పించడం రొటీన్‌గా మారిందని విమర్శిస్తున్నారు.
50 గజాల లోపు స్థలాల్లో బహుళ అంతస్తులు ఎలా నిర్మిస్తున్నారు?
నాలాల పక్కన నిబంధనలకు విరుద్ధంగా భవనాలు వెలుస్తుంటే అనుమతులు ఎలా ఇస్తున్నారు?
ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి శేరిలింగంపల్లి జోన్‌లో నిర్మిస్తున్న భవనాల అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడిన టౌన్ ప్లానింగ్ అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
* అక్రమ నిర్మాణాల పైన ఇటీవల విజయ క్రాంతి దినపత్రికలో వర్ష ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. నిబంధనలో ఉల్లంఘనలు, అధికారుల చేతివాటాలు.... చైన్ మెన్ నుంచి అధికారుల వరకు... ముడుపుల ముట్టజెప్పడం.... ఇలా ప్రతి అంశం పైన ఇటీవల వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అక్రమ కట్టడాల వల్ల... భవిష్యత్తులో జరిగే ప్రమాదాలు... ఇబ్బందులను.. ముందు హెచ్చరించిన.... అధికారుల్లో అలసత్వం ఈడ లేదు... ఇప్పుడు జరిగిన అంజయ్య నగర్ ఘటనలతో.... అధికారంలో చలనం వచ్చింది..






