గిరిజన, ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం
పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి
రాష్ట్ర ఎస్సి, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఉట్నూర్,(విజయక్రాంతి): గిరిజన, ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ఉట్నూరు పీఎంఆర్సీ కేబీ కాంప్లెక్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, నిధుల వినియోగంలో జాప్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించడంతో పాటు రహదారులు, ఇతర మౌలిక వసతులను బలోపేతం చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: పీ జి. నగేష్
గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఎంపీ జి. నగేష్ కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పారదర్శకంగా, నిర్దేశిత లక్ష్యాల మేరకు వినియోగించాలని సూచించారు. రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లో బాత్రూమ్‌లు, మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని కోరారు.
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్సీ దండే విఠల్
గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాల కొరతను పరిష్కరించాలని ఎమ్మెల్సీ దండే విఠల్ కోరారు. అటవీ శాఖ అనుమతుల కారణంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు త్వరితగతిన క్లియరెన్స్ వచ్చేలా శాఖల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. పదో తరగతి అనంతరం గిరిజన విద్యార్థుల డ్రాపౌట్లను నివారించేందుకు మరిన్ని గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని కోరారు.
పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలోని 569 విద్యా సంస్థల్లో సుమారు 54 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, సోషల్ వెల్ఫేర్ శాఖ పరిధిలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ వేలాది మంది విద్యార్థులకు విద్య అందుతున్నట్లు వివరించారు.
బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థిని పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సంక్షేమ శాఖల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, కిట్ల పంపిణీ ప్రారంభించినట్లు చెప్పారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 26 మందికి సహాయక పరికరాలు అందించినట్లు వెల్లడించారు.
ఐటీడీఏ పరిధిలో సమగ్ర అభివృద్ధి: పి.ఓ మంద మకరందు
ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు తెలిపారు. పీఎం-జన్మన్ పథకం కింద పీవీటీజీ ఆవాసాలకు మొబైల్ వైద్య సేవలు అందిస్తున్నామని, 13 అంబులెన్సులు, 102, 108 సేవలు, 186 సబ్ సెంటర్ల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. ‘విద్యా వీక్షణ’ ఏఐ ఆధారిత వ్యవస్థతో విద్యార్థుల హాజరు, ఆహారం, హాస్టళ్ల నిర్వహణను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులైన గిరిజన రైతులకు ‘ఇందిరా సౌరజల వికాసం’ ద్వారా సాగునీటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రెండు విడతల్లో 26,352 మంది రైతులను గుర్తించినట్లు తెలిపారు.
గిరిజన విద్యా సంస్థల బలోపేతానికి చర్యలు: ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, గిరిజన సంక్షేమం, విద్యా సంస్థలు, మౌలిక వసతులపై గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించి సమగ్ర నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి రోడ్లు, వంతెనల పనులకు సంబంధించిన టెండర్లు, అగ్రిమెంట్లను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని, అటవీ అనుమతుల జాప్యాన్ని నివారించాలని కోరారు.
అంతకుముందు కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహక నగదు చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సంతోష్, గురుకులాల కార్యదర్శి సీతమహాలక్ష్మి, ఐటీడీఏ, సోషల్ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, దివ్యాంగుల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






