23 August, 2026 | 1:23 AM

ఆయ్‌కి నేనూ మ్యూజిక్ చేశా.. క్రెడిట్ మాత్రం ఆయనకు!

23-08-2026 12:33 AM

పవన్‌కళ్యాణ్‌తో మీటింగ్  మర్చిపోలేను: అజయ్ అరసాడ

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్టులతో సంగీత దర్శకుడిగా తెలుగు సంగీత ప్రియుల మనసు గెలిచాడు అజయ్ అరసాడ. ఇటీవల వరుస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అజయ్ అరసాడ, తన సినీజర్నీ గురించి చెప్పిన విశేషాలివీ..  

* మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. జాబ్ చేస్తున్న టైమ్‌లోనే రెండు సినిమాలకు పనిచేశా. మా అమ్మ, భార్య సపోర్ట్ వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి రాగలిగా. మా వైజాగ్‌లోనే శ్రీచరణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘గూఢచారి’కి నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తీసుకున్నాడు. నాకు దేవీశ్రీప్రసాద్ స్ఫూర్తి. 

* అన్ని రకాల జానర్లు, కథల్ని చేయాలని అనుకుంటున్నా. నా వద్దకు వచ్చిన కథకు న్యాయం చేయాలని చూస్తా. నా వద్దకు మాస్ కథ వస్తే.. మాస్ మ్యూజిక్ వస్తుంది. తమిళ్ నుంచి వస్తే కొత్తగా ఇస్తాడు, మలయాళం నుంచి వస్తే ఫ్రెష్‌గా ఇస్తారని ఇక్కడ కొంత మంది నమ్ముతారు. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయింది. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. 

* నా పాటకు ఎవరు సెట్ అవుతారనుకుంటే ఆ సింగర్‌తోనే ప్రొసీడ్ అవుతా. కెరీర్ ఆరంభంలో అనురాగ్ కులకర్ణితో పాడిస్తానంటే ఓ నిర్మాత వద్దన్నాడు. ఇప్పుడు ఆ నిర్మాతే అనురాగ్‌తో పాడించుకునే స్థాయిలో లేడు (నవ్వుతూ).

* మేం థియేటర్‌కు సరిపోయేలా మ్యూజిక్, స్కోర్ ఇస్తాం. చివరకు ఓటీటీలోకి తీసుకువచ్చేసరికి మేం పడిన కష్టం వృథా అవుతుంది. ‘వికటకవి’ని థియేటర్‌లో చూస్తే సౌండింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఓటీటీలో యాభై శాతానికి పడిపోతుంది. 

* ఏఐని వాడి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వొచ్చని అనుకోవడం భ్రమ. కొంత మంది నిర్మాతలు ఏఐ నుంచి ట్రాక్స్ పంపి.. ఇలా కావాలని అంటారు. అలాంటప్పుడు మేం ఎందుకు మీరే కొట్టుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది (నవ్వుతూ). ఇప్పుడు వస్తున్న చాలా మంది దర్శకులకు కూడా మ్యూజిక్ గురించి తెలియడం లేదు. సినిమా కాన్సెప్టును కూడా సరిగ్గా వివరించలేకపోతున్నారు.  

* నేను జనసేన కార్యక్రమాలకు మ్యూజిక్ ఇస్తా. మొన్న మోదీని పవన్‌కళ్యాణ్ కలిసినప్పుడు ఓ స్కోర్ చేస్తే, నన్ను పర్సనల్‌గా పిలిపించారు. అయితే, పవన్‌కళ్యాణ్‌తో మీటింగ్ అంటే మొదట నేను నమ్మలేదు. కానీ, పీకే ఒక్కరే ఉన్నారు. దాదాపు అరగంట మాట్లాడారు. కలిసి చేయాల్సిన ప్రాజెక్టుల గురించి చెప్పారు. నా దగ్గర కాఫీ మగ్ షేప్‌లో ఓ బోస్ స్పీకర్ ఉంటుంది. దాన్ని పట్టుకుని సరదాగా నవ్వారు. కాఫీ పట్టుకొచ్చావా? అని జోక్స్ వేశారు. ఈయనేంటి? నాతో జోక్స్ వేస్తున్నారనుకుని లోలోపల సంబరపడిపోయా.  

* మ్యూజిక్ విషయంలో క్రెడిట్స్ మిస్ అయితే బాధగా ఉంటుంది. ‘ఆయ్’ విషయంలో నాకు ఆ అనుభవం ఎదురైంది. ఆ సినిమాకు రామ్ మిర్యాల కూడా రెండు పాటలు ఇచ్చారు. మిగతా అంతా నేనే చేశా. కానీ ఆయన పేరే కనిపించేది. బన్నీ వాస్ కరెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇటీవల ‘సేవ్ ది టైగర్స్’ టైమ్‌లోనూ నా పేరు కాకుండా ఎవరి పేరో కనిపించింది. నేను మాత్రం నా టీమ్‌లో ప్రతి ఒక్కరికీ క్రెడిట్ ఇస్తా.