అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ షురూ
దళారులను నమ్మి మోసపోవద్దు
డి డబ్ల్యు ఓ స్వర్ణలత లెనినా
కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీకి చేపట్టిన ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, ఎటువంటి దళారులను నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, తమకు పరిచయాలు ఉన్నాయని చెప్పే వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించారు.
అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి, మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. పూర్తిగా పారదర్శకంగా,నిబంధనల ప్రకారం జరుగుతుందని జిల్లా సంక్షేమాధికారి పేర్కొన్నారు. అభ్యర్థులను ఎలాంటి ప్రలోభాలకు మభ్య పెట్టిన, అటువంటి వారిపై సమాచారం తెలపాల్సిందిగా సూచించారు. వచ్చే వారంలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖాముఖి (ఇంటర్వ్యూ) నిర్వహించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా తెలియజేస్తామని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తెలిపారు.






