గిరిజన విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి
విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో
మహాదేవపూర్,(విజయక్రాంతి): గిరిజన విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన విద్య, ఆరోగ్యం, వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, ఆదేశించారు. శనివారం మహాదేవపూర్ లో విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల రోజువారీ హాజరును పర్యవేక్షించాలని, అర్హులైన విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్‌ను ఆదేశించారు. విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, ఆదాయ–కుల ధ్రువీకరణ పత్రాల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
విద్యార్థులకు యూనిఫాం వస్త్రాలు అందించి, స్వయం సహాయక బృందాల ద్వారా కుట్టు పనులు త్వరగా ప్రారంభించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, ఏఎన్ఎంల లభ్యత, పరిశుభ్రత, నాణ్యమైన ఆహారంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో మరమ్మతు, నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈ హరీష్, ఏటీడీఓ శివకృష్ణ, ఏఈ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.






