బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు కేటాయించాలి
టీబీసీ సాధన సమితి డిమాండ్
ముషీరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ సమాజ సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ బ్రాహ్మణ పరిషత్’కు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన నిధులు కేటాయించి, సభ్యులను నియమించాలని ‘తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ సాధన సమితి’ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి చైర్మన్ రుద్రవీణ బాల సుబ్రమణ్యం మాట్లాడారు.
రాష్ట్రంలోని ఇతర సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న నేపథ్యంలో, బ్రాహ్మణ సమాజానికి కూడా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం బ్రాహ్మణ పరిషత్ ను బ్రాహ్మణ కార్పొరేషన్‌గా మార్చాలని ఆయన కోరారు.
బ్రాహ్మణ సమాజంలోని విద్య, ఉపాధి, ఆర్ధిక, సామాజిక సంక్షేమ అవసరాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వం బ్రాహ్మణ సమాజ ప్రతినిధులతో చర్చించి, సమస్యలకు కాలపరిమితితో కూడిన పరిష్కార మార్గాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
లేకుంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని రుద్రవీణ బాల సుబ్రమణ్యం హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు, అకినేపల్లి పురుషోత్తం రావు, కే సతీష్ కుమార్, కాశీనాథ శర్మ తదితరులు పాల్గొన్నారు.






