23 August, 2026 | 1:34 AM

విద్యార్థుల చదువుకు పూర్తి బాధ్యత నాది: హరీష్ రావు

23-08-2026 12:35 AM

నంగునూరు,(విజయక్రాంతి): పేద విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. నంగునూరు మండలం అక్కనపల్లి మోడల్ పాఠశాలలో శనివారం నిర్వహించిన 'మీ భవిష్యత్.. మీ బాధ్యత' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కల్తీ లేని అమ్మ ప్రేమను గుర్తుచేస్తూ, కష్టపడి చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లుగా ఎదుగుతూ తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని విద్యార్థులను కోరారు.

తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులు చదువు గురించి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ కళాశాలల్లో సీటు సాధిస్తే ఫీజులు చెల్లించి చదివించే బాధ్యత పూర్తిగా తనదేనని భరోసా కల్పించారు. పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని, వసతుల కల్పనలోనూ,విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాల అందించడంలోనూ విఫలమైందని ఆయన మండిపడ్డారు.