23 August, 2026 | 1:23 AM

రిజర్వేషన్లపై ఉద్యమాలు సమాజాన్ని చీల్చే ప్రయత్నం

23-08-2026 12:00 AM
  1. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు
  2. సమానత్వం కోసం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే
  3. వ్యతిరేక ఉద్యమాలు కొనసాగితే ప్రతిఘటన తప్పదు
  4. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హెచ్చరిక 

ముషీరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం సమాజాన్ని చీల్చే ప్రయత్నమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనను ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యానగర్ బీసీ భవన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీలు దేశ జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం రిజర్వేషన్లు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమాలను తక్షణమే నిలిపివేయాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యమాలు కొనసాగితే పెద్ద ఎత్తున ప్రతిఘటన చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, బీసీ నాయకులు సీ రాజేందర్, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.