మహిళల భద్రతకు అప్రమత్తత అవసరం
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): మహిళల భద్రతకు అప్రమత్తత, సమయానికి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎంతో ముఖ్యమని ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ సత్యరాణి పేర్కొన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సఖి కేంద్రం ప్రతినిధులతో కలిసి ఆమె మాట్లాడారు.
మహిళల అక్రమ రవాణా, దానికి గల కారణాలు, హెచ్చరిక సంకేతాలు, నివారణ చర్యలు, చట్టపరమైన రక్షణ గురించి విద్యార్థినులకు వివరించారు. తప్పుడు ఉద్యోగాలు, వివాహం, అధిక వేతనాల పేరుతో వచ్చే మోసపూరిత ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు 181 మహిళా హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవచ్చని, కౌన్సెలింగ్‌తో పాటు అవసరమైన సహాయ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.






