ప్రమాదమని తెలిస్తే కాల్ చేయండి
నిర్మల్,(విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందని జిల్లా విద్యుత్ పర్యవేక్షక ఇంజనీర్ జాదవ్ సుభాష్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిబ్బందికి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. ఎక్కడైనా విద్యుత్ ప్రమాదం పొంచి ఉంటే కాల్ సెంటర్కు కాల్ చేయాలని సూచించారు.
వర్షం సమయంలో తడిసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపోయిన లేదా వేలాడుతున్న విద్యుత్ తీగలను తాకరాదని, తడి చేతులతో విద్యుత్ పరికరాలను ఉపయోగించవద్దని సూచించారు. రైతులు వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లకు సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ లైన్ల కింద ఇనుప పైపులు ఎత్తేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పిల్లలను ఆడనివ్వకుండా, పశువులను కట్టరాదని తెలిపారు. విద్యుత్ లైన్లలో లోపాలు లేదా తెగిపోయిన తీగలు కనిపిస్తే వెంటనే టీజీఎన్‌పీడీసీఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని కోరారు.






