30 July, 2026 | 6:12 PM

దేశంలో విమాన ఛార్జీలపై నియంత్రణేది?

30-07-2026 05:03 PM

* ధరలు విపరీతంగా పెరగడానికి గల కారణాలేంటి..?

* జలజీవన్ మిషన్‌లో తెలంగాణలోని గ్రామీణ గృహాలకు నల్లా కనెక్షన్ల పరిస్థితి ఎలా ఉంది?

* లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ప్రశ్నలు

* సమాధానాలిచ్చిన కేంద్ర మంత్రులు మోహోల్, వి. సోమన్న

ఖమ్మం,(విజయక్రాంతి): దేశంలో విమాన సర్వీసుల ధరల పెరుగుదల, ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తీరుతెన్నులపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గురువారం ప్రశ్నించారు. ​విమాన ఛార్జీలు విపరీతంగా పెరగడానికి గల కారణాలేంటి? అని ఆరా తీశారు. దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా..

మార్కెట్ డిమాండ్, సీజనాలిటీ మరియు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఎయిర్‌లైన్స్ స్వయంగా ఈ డైనమిక్ ధరలను నిర్ణయిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. తక్కువ ఛార్జీల టికెట్లు అమ్ముడైపోయిన కొద్దీ ధరలు పెరుగుతాయని,ప్రయాణికులకు అందుబాటు ధరలు కల్పించేలా డైనమిక్ ప్రైసింగ్ ఫ్రేమ్‌వర్క్ పని చేస్తుందని తెలిపారు.

చార్జీల పర్యవేక్షణకు డీజీసీఏ

​ఎయిర్‌లైన్స్ సంస్థలు తాము ప్రకటించిన పరిమితిని మించి అధిక ఛార్జీలు వసూలు చేయకుండా పర్యవేక్షించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్  ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 'టారిఫ్ మానిటరింగ్ యూనిట్' ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఎంపిక చేసిన 78 రూట్లలో విమాన ఛార్జీలను పరిశీలిస్తుందని పేర్కొంది. 

అధిక చార్జీలపై ఫిర్యాదుకు.. ఎయిర్ ఫేర్ గ్రీవెన్స్

అధిక ఛార్జీలపై ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి జూలై 2025 నుంచి 'ఎయిర్‌సేవా' ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేకంగా 'ఎయిర్ ఫేర్' గ్రీవెన్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా జూలై-డిసెంబర్ 2025లో 394 ఫిర్యాదులు, జనవరి నుంచి జూలై 2026 వరకు 315 ఫిర్యాదులు అందగా వాటిని పరిశీలించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

'జల్ జీవన్ మిషన్' అమలు తీరుపై మరో మంత్రి సమాధానమిస్తూ..

జలశక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న వివరాలు అందజేశారు. ఆరంభంలో దేశవ్యాప్తంగా కేవలం 3.24 కోట్లు (16.72%) ఉన్న గ్రామీణ కుళాయి కనెక్షన్లు, జూలై 18, 2026 నాటికి 15.89 కోట్లకు (82.09%) చేరుకున్నాయని మంత్రి తెలిపారు. ​ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 53,98,219 గ్రామీణ కుటుంబాలకు వంద శాతం నల్లా కనెక్షన్లు అందించినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా కుళాయి కనెక్షన్‌కు దూరంగా లేదని కేంద్రం స్పష్టం చేయగా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 95,53,387 కుటుంబాలకు గాను ఇప్పటివరకు 72,10,929 కనెక్షన్లు ఇచ్చామని, ఇంకా 23,42,458 కుటుంబాలకు కనెక్షన్లు అందాల్సి ఉందని వెల్లడించారు.