కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన
ముకరంపుర,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద భారతీయ జనతా యువ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరెడ్ల ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సంగ నరేష్ పాల్గొని ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. తూ తూ మంత్రంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం ,జిల్లా ప్రధాన కార్యధర్శి ఎడవెల్లి శశిధర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






