9 April, 2026 | 2:02 AM

కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా

09-04-2026 12:00 AM
  1.   22కు వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం
  2. జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్ల వాదనలు ఇప్పటికే పూర్తి

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తీర్పును హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం, నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటుచేసిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే కోర్టు వాదనలు విన్నది.

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించాల్సి ఉన్న క్రమంలో, తీర్పు వస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ ధర్మాసనం తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీచేసింది.

దీనిని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్కే జోషి వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశకుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. కొన్నినెలలుగా ఈ పిటిషన్లపై వాదనలు జరిగాయి. మార్చి 12న దీనిపై వాదనలు పూర్తవగా, కోర్టు తీర్పును రిజర్వ్‌చేసింది.

కానీ.. అనుహ్యంగా ధర్మాసనం తుదితీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. కమిషన్ నివేదికను కొట్టివేయాలని, అందులో ఉన్నదంతా అవాస్తవమని, రాజకీయకక్షలో భాగంగానే ఈ కమిషన్‌ను వేశారని పిటిషనర్లు ఆరోపించారు. కాగా ప్రజాప్రయోజనాలను కాపాడేందుకే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్‌ను వేశామని ప్రభుత్వం తెలిపింది.

అయితే వాదనల సమయంలో కేసీఆర్ తరఫు అడ్వకేట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. 8(బీ), 8(సీ) నోటీసులు ఇవ్వలేదని, ఎక్కడా విచ్‌నెస్‌తో క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదని పేర్కొన్నారు. ఎలాంటి విచారణ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ప్రభు త్వం ఒక నిర్ణయానికి రావడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.