9 April, 2026 | 3:15 AM

అధ్వాన్నంగా చారకొండ ‘సబ్ సెంటర్’!

09-04-2026 12:48 AM
  1. కరెంట్ లేదు.. విరిగిన కిటికీ తలుపులు, ఊడుతున్న పై పెచ్చులు. 
  2. ఉక్కపోతతో పసి పిల్లలు, బాలింతల అవస్థలు
  3.  ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని పట్టించుకోని అధికారులు

చారకొండ, ఏప్రిల్ 8: ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాతావరణం.. దీనికి తోడు ప్రాణాలు కాపాడాల్సిన వైద్యశాల భవనమే ప్రాణసంకటంగా మారిన వైనం.. ఇదీ చారకొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య ఉప కేంద్రం (సబ్ సెంటర్) దుస్థితి.

మండల కేంద్రంలోని గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలతో పాటు వృద్ధులకు అత్యంత కీలకమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రగల్బాలు పలికే పాలకులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఊడిపడుతున్న స్లాబ్ పెచ్చులు.

ఉప కేంద్రం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కిటికీలు, దర్వాజ తలుపులు ఊడిపోయి ఉండటంతో భవనం అనాథలా కనిపిస్తోంది. లోపలికి వెళ్తే ఎప్పుడు పైనుంచి స్లాబ్ పెచ్చులు ఊడి పడతాయోనని రోగు లు, సిబ్బంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. చిన్న పిల్లలకు టీకాలు వేసే సమ యంలో పెచ్చులు ఊడితే పరిస్థితి ఏమిటని తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో వచ్చి పోయే బాలింతలు గర్భిణీలు చిన్నపిల్లలు తల్లులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. 

కరెంటు లేదు.. ఎండల తీవ్రతతో నరకయాతన

అసలే వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి సమయం లో ఈ ఆరోగ్య కేంద్రంలో కరెంటు సౌకర్యం లేకపోవడం గమనార్హం. ఫ్యాన్లు తిరగకపోవడంతో చిన్న పిల్లలకు టీకాలు ఇప్పించడానికి వచ్చే బాలింతలు, పసిబిడ్డలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న పరిస్థితి. టీకా కోసం వచ్చిన పసిబిడ్డలు ఉక్కపోత భరించలేక ఏడుస్తున్నారు.

ఈ సబ్ సెంటర్లో కేవలం టీకాలు మాత్రమే కాకుండా ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో మండల కేంద్రంలోని షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక రోగులకి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చే స్తుంటారు. ఎండల తీవ్రతకు తోడు కరెంటు లేకపోవడంతో పరీక్షల కోసం వచ్చే వృద్ధు లు, రోగులు చెమటలతో తడిసి ముద్దవుతున్నారు. అటు వైద్య సేవలు అందించే సిబ్బం ది కూడా కనీస సౌకర్యాలకు నోచుకోక విధులు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారు.

పట్టించుకోని అధికారులు:

సబ్ సెంటర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా, సంబంధిత అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, శిథిలావస్థలో ఉన్న భవనానికి మరమ్మతులు చేయించి, వెంటనే విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.