మామునూరుకు మహర్దశ
- ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన
- ఆదిలాబాద్‌లో పెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం
- పరిశీలనలో కొత్తగూడెం ఎయిర్‌పోర్టు కూడా
- 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు ఆధికారులు
- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): మామునూరు ఎయిర్‌పోర్టుకు మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నామని, ఆదిలాబాద్, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదిలా బాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు చెప్పారు. ఫీజిబిలిటీ ఉన్న చోట ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ గోడెం నగేష్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి కీలకమైన సమావేశం జరిగిందన్నారు. ఎప్పటినుంచో తెలంగాణలో.. ఒకే విమానాశ్రయం హైదరాబాద్‌లో ఉందని, మిగిలిన ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలుండాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు.
ఫీజిబిలిటీకి తగ్గట్లుగా విమానాశ్రయాలు నిర్మించాలనేది ప్రధానమంత్రి మోదీ ఆలోచన అని, అందులో భాగంగా.. వరంగల్‌లో విమానాశ్రయానికి అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖకు 360 ఎకరాల భూమి కూడా ఉందని, సివిల్ ఏవియేషన్‌తో కలిసి జాయింట్ వెంచర్‌కు సిద్ధంగా ఉన్నామని రక్షణశాఖ చెప్పిందన్నారు. సైన్యానికి శిక్షణతోపాటు సివిల్ ఏవియేషన్ అవసరాల కోసం దాన్ని వాడాలని రక్షణశాఖ మంత్రి చెప్పారన్నారు.
ఈనెల 17న ఆదిలాబాద్ భూములను క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు వెళ్లనున్నట్లు తెలిపారు. అయితే ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని, భూ సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆదిలాబాద్ జిల్లా నాయకులు చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టుకు కావాల్సిన అన్ని అనుకూలతలు ఆదిలాబాద్‌కు ఉన్నాయని, పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని ఆయన పేర్కొన్నారు.
అక్కడ ఫీజిబిలిటీని పరిశీలించాల్సి ఉందన్నారు. తెలంగాణకు ముఖద్వారమైన.. ఆదిలాబాద్‌లోనూ పర్యాటకానికి, వివిధ వాణిజ్య కార్యక్రమాలను ప్రోత్సహించేలా విమానాశ్రయం రావాలని చిరకాల డిమాండ్ ఉందన్నారు. కిషన్‌రెడ్డితో నిరంతరం చర్చిస్తూ.. వివిధ ఫీజిబుల్ ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణంపై దృష్టిసారించామన్నారు. ఇందులో భాగంగా.. ఆదిలాబాద్‌లో దాదాపు 360 ఎకరాలకు సంబంధించిన రక్షణశాఖ స్థలంలో విమానాశ్రయం నిర్మించాలనుకున్నామన్నారు.
గత ఏడాది కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్షణశాఖ మంత్రిని కలిశామని, దీనికి ఆ శాఖ అంగీకారం కూడా తెలిపిందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. మొదట దీన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించాలని అనుకున్నామని, కానీ డిఫెన్స్ మినిస్ట్రీకి వ్యూహాత్మకమైన ప్రాంతం కావడం, వైమానిక దళం ట్రైనింగ్‌కు కీలకమైన ప్రాంతం కావడంతో.. ఈ విమానాశ్రయాన్ని డిఫెన్స్ మినిస్ట్రీ నిర్మించాలని నిర్ణయించిందని, దీంట్లో ఒక పక్కన సామాన్య ప్రజలకోసం విమానసేవల టర్మినల్‌ను ఎయిర్‌పోర్ట్ అథారిటీ నిర్మించనుందన్నారు.
విమానయాన శాఖ, రక్షణశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి.. ఏప్రిల్ 17న క్షేత్రస్థాయిలో సర్వే చేసిన తర్వాత.. రన్ వే ఓరియంటేషన్ పై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఆ ఫీల్డ్ విజిట్ తర్వాత.. రక్షణశాఖ మాస్టర్ ప్లాన్‌కు అంగీకారం తెలియజేస్తారన్నారు. అనంతరం శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని అప్పజెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. అందుకు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని, దానికి అంగీకారం తెలిపినట్లు ఆయన చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆ స్థలం ఫీజిబుల్ కాదు..
ఆదిలాబాద్ చాలా ఐడియల్ లొకేషన్ అని, భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉన్న ప్రాంతమన్నారు. ఒక కమర్షియల్ హబ్‌గా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందన్నారు. జేవర్ విమానాశ్రయంను యూపీ ప్రభుత్వం పీపీపీ మోడల్‌ల్లో చేపట్టారని, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే.. రాష్ట్రం భూమిని మాకు అప్పగించాలన్నారు.
ఇలాంటి 36 విమానాశ్రయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయన్నారు. ఒక విమానాశ్రయానికి 600 నుంచి 700 ఎకరాలు అవసరమని, పెద్దపెద్ద విమానాశ్రయాలు భవిష్యత్ కోసం కావాలంటే.. కనీసం 1200 ఎకరాలు అవసరం అవుతాయన్నారు. కొత్తగూడెంకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఫీజిబుల్ కాదని, ఈ విషయాన్ని వారికి తెలియజేశామన్నారు.
కేంద్రమంత్రులతో చర్చించాం: కిషన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్ స్ట్రిప్ ఉన్నదని, ఆ స్థలంలో నూతన విమానాశ్రయం కట్టాలని చాలాకాలంగా డిమాండ్ ఉందన్నారు. ఈ విషయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి చర్చించామకని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ అధికారులు, రక్షణశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




