ఇప్పుడే ఇట్లా.. వర్షాకాలంలో ఎట్లా?
ముందుకు సాగని మురుగు నీరు
కేసముద్రం, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా కేసముద్రం పట్టణ డ్రైనేజీ పరిస్థితి మారింది. కేసముద్రం మండల కేంద్రాన్ని కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలను విలీనం చేసి కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా చొరవచూపి ప్రభుత్వం నుండి వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు.
ఇందులో భాగంగా రోడ్ల విస్తరణతో పాటు డ్రైనేజీ మెరుగుపరచడానికి చర్యలు చేపట్టారు. రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించగానే కొందరు తమకు నష్టం జరుగుతోందని, ఇండ్లు కోల్పోతున్నామని అభ్యంతరం వ్యక్తం చేయడంతో రోడ్ల పనులు పలుచోట్ల అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రోడ్ల విస్తరణ కోసం పాత డ్రైనేజీ కాలువలను పూర్తిగా తవ్వడంతో ఇప్పుడు మురుగు నీరు అంతా ఎక్కడికి అక్కడే తిష్ట వేస్తోంది.
గతంలో ఉన్న డ్రైనేజీలను పూర్తిగా తొలగించడం వల్ల పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట, అలాగే వీధుల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయి కంపు కొడుతున్నాయి. ఇండ్ల ముందు, షాపుల వద్ద కొన్నిచోట్ల సైడ్ కాలువల్లో మురుగునీరు తిష్ట వేసి, అనారోగ్యానికి అడ్డాలుగా మారుతున్నాయి. దీంతో కొందరు గత్యంతరం లేక ఇంటి ఎదుట మురుగునీరు నిలువ కోసం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఫ్లై మహాత్మ జ్యోతిబాపూలే సెంటర్ నుండి రైల్వే ఫ్లైఓవర్ మీదుగా పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు రోడ్డు విస్తరించినప్పటికీ డ్రైనేజీ పనులు చేపట్టలేదు. దీనితో ఆ రహదారి వెంట ఇరువైపులా ఉన్న షాపులు, ఇండ్లలోని మురుగునీరు అక్కడే తిష్ట వేస్తోంది. ఇక వర్షాకాలం వస్తే వరద నీరు కూడా రోడ్డుపైనే ప్రవహించాల్సిన పరిస్థితి నెలకొంది. కేసముద్రం పట్టణంలో మండు వేసవికాలంలోనే డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీరు ముందుకు సాగని పరిస్థితి ఇలా ఉంటే, ఇక వర్షాకాలంలో ప్రజలు ఎన్ని తిప్పలు పడాలో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడి నీరు అక్కడే నిలిచి ఉండడం వల్ల దోమల బెడద తీవ్రంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు స్పందించి అభ్యంతరం లేని చోట పనులు పూర్తిచేసి ఇబ్బందులు తొలగించాలని, మున్సిపాలిటీ అధికారులు మురుగునీరు నిలవకుండా పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బయటకు రాలేకపోతున్నాం
పాత కాలువలను కూలగొట్టారు. కొత్తవి నిర్మించకుండా వదిలేశారు. మురుగు నీరు అంతా ఇంటి ముందే నిలుస్తోంది. దుర్గంధం వల్ల ఇంట్లో ఉండడం కష్టం కాగా, కనీసం బయటకు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్లు పూర్తి చేయకపోవడంతో అటు దుబ్బ, ఇటు సైడ్ కాలువలు నిర్మించకపోవడంతో దుర్గంధంతో ఇంట్లో నుండి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.
కొడకండ్ల మౌనిక, గృహిణి
త్వరితగతిన పూర్తి చేస్తాం
కేసముద్రం పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన ప్రధాన, అంతర్గత డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మురుగునీరు ఎక్కడ కూడా నిలవకుండా అవసరమైన లెవెల్స్ తీసుకోవడానికి ఇంజనీరింగ్ అధికారుల ద్వారా చర్యలు చేపట్టాం. వర్షాకాలానికి ముందే డ్రైనేజీ పనులను పూర్తి చేయిస్తాం.
శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్, కేసముద్రం




