4 July, 2026 | 3:28 AM

రాజ్యాధికార సమరభేరి సభకు యూనివర్సిటీ అధ్యాపకుల మద్దతు

04-07-2026 02:29 AM

వరంగల్, జూలై 3 (విజయక్రాంతి): భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టిన రాజ్యాధికార సమరభేరి సభకు యూనివర్సిటీ బీసీ అధ్యాపకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన బీసీ అధ్యాపకుల సమావేశంలో బీసీ అధ్యాపకులు పాల్గొని సమరభేరి సభకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు బాధ్యతగా ఈ సభకు తమ మద్దతు ప్రకటించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సమైక్య ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారంలో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కటం లేదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించే బడ్జెట్ లో కూడా బీసీలకి న్యాయమైన వాటా కూడా దక్కటం లేదని, బీసీలు చట్టబద్ధంగా తమ  న్యాయమైన హక్కుల సాధన కోసం రాజకీయంగా ఒత్తిడి వర్గాలుగా ఎదగటంతోటే సాధ్యమవుతుందని బీసీ అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.

ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు వెనుకబడిన వర్గాలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత బలహీనవర్గాలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ రైటర్స్ వింగ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్, కాకతీయ విశ్వవిద్యాలయం బీసీ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్, మాథ్స్ విభాగం హెడ్ డాక్టర్ నాగయ్య, డాక్టర్ సదానందం రాజనీతి శాస్త్రం విభాగం ఇన్ చార్జ్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రచ్చ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.