15 July, 2026 | 1:57 AM

ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై ఐక్య ఉద్యమం

15-07-2026 01:57 AM

యుయస్పీసి స్టీరింగ్ కమిటీ నిర్ణయం

కామారెడ్డి, జూలై 14 (విజయక్రాంతి): ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలసి ఐక్య పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) స్టీరింగ్ కమిటీ ప్రతినిధి సకినాల అనిల్ కుమార్ అన్నారు.

యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం టిపిటిఎఫ్ కార్యాలయంలో టిటిఎ అధ్యక్షుడు ఎస్ హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఉపాధ్యా య, విద్యా రంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు, అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రాథమిక విద్యకు నష్టదాయకమైన జిఒ 25 ను సవరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.

పిఒ 2018కి అనుగుణంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదని సమావేశం విమర్శించింది. టెట్ లో సర్వీసు వెయిటేజ్ ఇవ్వాలని, సబ్జెక్టు వారీ పేపర్లతో స్పెషల్ టెట్ నిర్వహించాలని, బిసి, గిరిజన గురుకులాల టైంటేబుల్ మార్టాలని, మోడల్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, 5 వాయిదాల కరువు భత్యం (డిఎ) ను వెంటనే ప్రకటించాలని, పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలని అన్నారు.

పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.  ఈ సమావేశంలో యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, ఎ వెంకట్(టిఎస్ యుటిఎఫ్) సిహెచ్ అనిల్ కుమార్, ఎన్ తిరుపతి( టిపిటిఎఫ్), ఎం సోమయ్య, టి లింగారెడ్డి (డిటిఎఫ్), కొమ్ము రమేష్ (బిటిఎఫ్), వై విజయకుమార్, ఎం సైదులు (ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం), బి కొండయ్య (ఎంఎస్ టిఎఫ్), లక్ష్మణ్(టిటిఎ), రవీందర్, లక్ష్మయ్య యాదవ్(టిపిటిఎఫ్) తదితరులు పాల్గొన్నారు.