ప్రకృతి వనాలలో.. ఎండుతున్న మొక్కలు..
చోద్యం చూస్తున్న అధికారులు..
ఎండుతున్న పట్టించుకోరా..
తాడ్వాయి, జూలై 14 (విజయక్రాంతి): పల్లెల్లో, పట్టణాల్లో ప్రత్యేకంగా మొక్కలు పెంచి పచ్చని వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేకంగా పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు పేరుతో మొక్కలు పెంచడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.
అందులో భాగంగా ప్రకృతి వనాల్లో మొక్కలు నాటి వాటిని పెంచాలని సంకల్పించింది. కానీ ప్రస్తుతం ఆ మొక్కలు ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శ్రీ శబరి మాత ఆశ్రమం ఎదురుగా గుట్టపైన ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోతున్నాయి.
మొక్కలు ఎండిపోతున్న వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. మొక్కలకు నీటిని అందించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతోనే మొక్కలు ఎండిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మొక్కలకు ఎల్లవేళలా నీటిని అందించి వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఒక్క తాడ్వాయి మండల కేంద్రంలోనే కాకుండా మండలం లోని చాలా గ్రామాలలో, జిల్లాలో సైతం చాలా గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు ఎండిపోతున్నాయి. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రకృతి వనాలకు లక్షల ఖర్చు..
అప్పట్లో ప్రభుత్వం ప్రకృతి వనాలకు లక్షల రూపాయల నిధులు ఖర్చు చేసింది.ఒక్కో ప్రకృతి వనానికి లక్షల రూపాయల ఖర్చు చేసి మొక్కలు పెంపకాన్ని ప్రారంభించారు. ప్రకృతి వనములో మొక్కలు దట్టంగా ఉండాలని అధికంగా మొక్కలను నాటారు. ప్రకృతి వనాలను చిట్టడివిగా తయారు చేయాలని అధికారులు నిర్దేశించారు.
కానీ ఆ మొక్కలను సరైన విధంగా సంరక్షించే ఏర్పాట్లు చేయకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. ప్రకృతి వనాలు ప్రత్యేకంగా ఉండడం కోసం వనాల చుట్టూ ప్రత్యేక కంచె ఏర్పాటు చేసి దానికి బోర్డులను సైతం నెలకొల్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రకృతి వనాలు ఎండిపోతున్న మొక్కలను సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.






