అక్షర్ ఆల్‌రౌండ్ షో
- తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
- గిల్, అక్షర్, సుందర్ హాఫ్ సెంచరీలు
- సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యం
* టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా భారత్ తొలి అడుగు పడింది. వన్డే సిరీస్‌ను అదిరిపోయే విజయంతో ఆరంభించింది. అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన వేళ, గిల్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా సిరీస్‌లో ఆధిక్యాన్ని అందుకుంది.
బర్మింగ్‌హామ్, జూలై 14 : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ భారత్ బోణీ కొట్టింది. ఆసక్తికరంగా సాగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బుమ్రా రాకతో భారత పేసర్లు చెలరేగిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. డకెట్ ధాటిగా ఆడినా 43 పరుగుల దగ్గర గుర్నూర్ బ్రార్ పెవిలియన్‌కు పంపాడు. తర్వాత మిగిలిన బ్యాటర్లను ప్రసిద్ధ కృష్ణ, బుమ్రా కంగారెత్తించారు.
దీంతో ఇంగ్లాండ్ 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. బెథల్ (14), బ్రూక్ (1), బట్లర్ (5), సామ్ కురన్ డకౌటయ్యారు. దీంతో ఇంగ్లాండ్ 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఈ దశలో జో రూట్, డాసన్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్ కు రికార్డు స్థాయిలో 121 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 7 పరుగుల దగ్గర రూట్ ఇచ్చిన క్యాచ్‌ను శివమ్ దూబే అందుకోలేకపోయాడు.
దీంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రూట్ 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డాసన్ 68 పరుగులకు వెనుదిరిగాడు. వీరిద్దరి పార్టనర్ షిప్ కారణంగా ఇంగ్లాండ్ 47.5 ఓవర్ల లో 258 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లు పడగొట్టగా... ప్రసిద్ధ కృష్ణ, బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత ఛేజింగ్‌లో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారీ అంచనాలు పెట్టుకున్న రోహిత్ (11) నిరాశపరిచాడు.
కాసేపటికే విరాట్ కోహ్లీ(5) కూడా వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే కెప్టెన్ శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. వీరిద్దరూ 101 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పారు. శ్రేయాస్ అయ్యర్ 35 రన్స్‌కు ఔటైనా గిల్, వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ కొనసాగించారు.
గిల్ 80 (11 ఫోర్లు, 1 సిక్సర్) రన్స్ దగ్గర గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక్కడ నుంచి అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఐదో వికెట్‌కు 102 పరుగుల పార్టన ర్ షిప్ సాధించారు. దీంతో భారత్ 45.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని మూడు వన్డేల సిరీస్‌లో 1-- 0 ఆధిక్యంలో నిలిచింది.
స్కోరు బోర్డు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 258 (రూట్ 76 నాటౌట్, డాసన్ 68, డకెట్ 43 ; అక్షర్ పటేల్ 4/62, బ్రార్ 2/61, ప్రసిద్ధ కృష్ణ 2/50 )
భారత్ ఇన్నింగ్స్: 262/4 (గిల్ 80 , అక్షర్ పటేల్ 57 నాటౌట్, సుందర్ 52 నాటౌట్ ; ఆర్చర్ 1/60, టంగ్ 1/50)






