21 June, 2026 | 1:30 AM

కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి

21-06-2026 12:09 AM
  1. సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే డిమాండ్
  2. కార్యకర్తలతో కలిసి ఢిల్లీలో ధర్నా
  3. ప్రశ్నాపత్రాల లీకేజీపై నిలదీత

న్యూఢిల్లీ, జూన్ ౨౦: నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచెస్ జనతా పార్టీ (సీజేపీ) అధినేత అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాలను నిరసిస్తూ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తాము శాంతియుతంగా నిరసన చేపడుతున్నామని, అయినప్పటికీ పోలీసులు తమను అరెస్ట్ చేయాలనుకుంటే, అరెస్టయ్యే తొలి కార్యకర్తను తానే అవుతానని వెల్లడించారు. కొద్దిసేపు దీప్కే ప్రసంగించిన తర్వాత, పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

సీజేపీ నిరసనకు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమయం మించిపోయిందని ఆందోళనకారులను వారించారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేవరకు తాము ఆ ప్రదేశం నుంచి కదిలేది లేదని దీప్కేతోపాటు ఆయన అనుచరులు భీష్మించుకు కూర్చుకున్నారు. తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, తాము నిరసనను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

అయినప్పటికీ, పోలీసులు అనుమతి ఇవ్వలేవు. సీజేపీ కార్యకర్తల అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు. దీంతో దీప్కే మద్దతుదారులు ప్లేట్లను స్పూన్లతో మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. చెవిటివారికి వినపడాలంటే ఈ మాత్రం శబ్దం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాము తక్షణ ఫలితాల కోసం ఆశించడం లేదని, తమ గళాన్ని వినిపించడానికే వచ్చామని తెలిపారు. సీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడం ఇది రెండోసారి కావడం గమనార్హం.