21 June, 2026 | 1:29 AM

నేడు మళ్లీ నీట్

21-06-2026 12:11 AM
  1. పెన్- అండ్ -పేపర్ విధానంలోనే పరీక్ష
  2. మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు
  3. భారత్‌లో 551 నగరాలు, విదేశాల్లో 14 నగరాల్లో కేంద్రాలు
  4. 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు
  5. పరీక్షా కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్
  6. నాగ్‌పూర్ అభ్యర్థికి అబుదాబిలో నీట్ కేంద్రం
  7. తిరిగి నాగ్‌పూర్ సెంటర్‌నే కేటాయించిన ఎన్టీఏ 

న్యూఢిల్లీ, జూన్ 20: నీట్ పునః పరీక్షకు కేంద్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆదివారం నిర్వహిస్తున్న నీట్ పునఃపరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ‘పెన్- అండ్ -పేపర్’ విధానంలో (ఆఫ్‌లైన్‌లో) జరుగుతుంది. దీనికి భారతదేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. మరోపక్క ఈ పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శంగా నిర్వహించేందుకు శనివారం దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద కేంద్రప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షా కేంద్రాల వద్ద సన్నద్ధతను పరిశీలించడం, అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మాక్ డ్రిల్ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వద్ద భద్రతను పెంచారు. ఈ డ్రిల్‌లో భాగంగా పోలీసులు, పారామిలిటరీ దళాలతో సహా 2.5లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని 5000కు పైగా పరీక్షా సెంటర్ల వద్ద మోహరించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ అభ్యర్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అబుదాబీలో నీట్ మళ్లీ పరీక్ష కేంద్రం పడింది. దీంతో ఈ అంశం అంతా చర్చనీయాంశమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(నీట్) జారీ చేసిన నీట్ అడ్మికార్డులో లోపాలు బయటపడ్డాయి.

ఆ కేంద్రాన్ని సదరు అభ్యర్థి లాగిన్ ద్వారానే ఎంచుకున్నాడని, మళ్లీ నాగ్‌పూర్‌కు మార్చుకున్నాడని శనివారం ఎన్టీఏ తెలిపింది. జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ-టెస్ట్ కోసం తమ కుమారుడికి యూఏఈలోని అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించారని నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థి కుటుంబం ఆరోపించింది. అబ్దుల్లా తాలిబ్ అనే ఆ విద్యార్థి పరీక్ష కోసం నాగ్‌పూర్, వార్ధా, భండారా కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చాడని అతని తండ్రి డాక్టర్ మహమ్మద్ తాలిబ్ తెలిపారు. ‘శుక్రవారం మేము పరీక్షా అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, పరీక్షా కేంద్రం అబుదాబిలో ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆ తర్వాత మేము దీనిపై ఎన్టీఏకి ఫిర్యాదు చేశాం.

ఆ అభ్యర్థే అబుదాబికి మార్చుకున్నారు: ఎన్టీఏ

 నాగ్‌పూర్ అభ్యర్థికి అబుబాబిలో నీట్ పరీక్ష కేంద్రం పడడంపై ఎన్టీఏ స్పందించింది. ఆ అభ్యర్థే తన లాగిన్ వివరాలను ఉపయోగించి పరీక్షా కేంద్రాన్ని అబుదాబికి మార్చుకున్నారని ఎన్టీఏ స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం నాగ్‌పూర్‌కు రీ-టెస్ట్ కేంద్రంగా కేటాయించిన తర్వాత ఎన్టీఏ ఆ అభ్యర్థికి కొత్త అడ్మిట్ కార్డును జారీ చేసింది. కొత్త అడ్మిట్ కార్డుపై చాలా ఊరటచెందామని తాలిబ్ చెప్పాడు. అభ్యర్థే స్వయంగా అబుదాబి కేంద్రాన్ని ఎంచుకున్నారన్న ఎన్టీఏ వాదనపై స్పందిస్తూ, ‘అది ఎలా ఎంపికైందో మాకు తెలియదు’ అన్నాడు. ఈ విషయంపై తన వైఖరిని స్పష్టం చేస్తూ ఎన్టీఏ ‘ఎక్స్’లో ఒక ప్రకటన విడుదల చేసింది.

అభ్యర్థి అబుదాబి కేంద్రాన్ని ఎంచుకున్నప్పటికీ, పరీక్షకు కేవలం 48 గంటల ముందు, అంటే జూన్ 19 సాయంత్రం, కేంద్రాన్ని నాగ్‌పూర్‌కు మార్చాలంటూ ఎన్టీఏకు అతని తండ్రి నుంచి అభ్యర్థన అందింది. దీంతో ఈ మేరకు నాగ్‌పూర్‌లో కేంద్రం కేటాయించామని వెల్లడించింది. నీట్ పరీక్షను జూన్ 21కి వాయిదా వేసిన తర్వాత, అభ్యర్థులకు సహాయపడేందుకు పరీక్షా నగరాన్ని మార్చుకునే అవకాశాన్ని (కరెక్షన్ విండో) ఎన్టీఏ తిరిగి తెరిచిందని సంస్థ తెలిపింది. సుమారు 3.2 లక్షల మంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని, వారిలో 99.5 శాతానికి పైగా అభ్యర్థులకు వారు కోరుకున్న పరీక్షా నగరాన్నే కేటాయించామని ఎన్టీఏ స్పష్టం చేసింది.