16 ఔషధాలపై నిషేధం
- డీటీఏబీ సిఫార్సుల మేరకు కేంద్రం నిర్ణయం
- తయారీ, విక్రయం, సరఫరా నిలిపివేయాలని సంస్థలకు ఆదేశం
న్యూఢిల్లీ, జూన్ 20: ప్రజారోగ్యం కోసం వాడుతున్నా ప్రయోజనం చూపని 16 రకాల ఎఫ్‌డీసీ (ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్) ఔషధాలపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని శనివారం వెలువరించిన ఓ ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌డీసీ మందులపై డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుకు (డీటీఏబీ) చెందిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు అందజేసింది.
ఈ సూచనల ప్రకారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 1940 నాటి ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టంలోని సెక్షన్ 26ఎ కింద నిషేధం నోటిఫికేషన్ జారీ చేసింది. యాంటిబయోటిక్స్, టాపికల్, కాస్మిటిక్స్‌కు సంబంధించిన మందుల తయారీ, విక్రయం, సరఫరా వెంటనే నిలిపివేయాలని ఈ రకమైన మందులను తయారు చేస్తున్న సంస్థలను ఆదేశించింది. రాష్ట్రాల స్థాయిలోని డ్రగ్ కంట్రోల్ సంస్థలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు నిషేధ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండు అంతకంటే ఎక్కువ ఔషధాల మిశ్రమం వాడి ఒకే మోతాదులో టాబ్లెట్, సిరప్‌ను రూపొందిస్తారు. వీటినే ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలని అంటారు.
నిషేధించిన ఔషధాలు..
ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ ఎథోహెప్టాజైన్, డైసైక్లోమైన్ పారాసెటమాల్ క్లిడినియం బ్రోమైడ్, క్లోర్డియాజెపాక్సైడ్ గ్లిక్లాజైడ్ క్రోమియం పికోలినేట్, పారాసెటమాల్ లిగ్నోకైన్, అమోక్సిసిలిన్ సెరాటియోపెప్టిడేస్, అమోక్సిసిలిన్ సెరాటియోపెప్టిడేస్ లాక్టోబాసిల్లస్ స్పోరోజెనెస్, అమోక్సిసిలిన్ లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ సెరాటియోపెప్టిడేస్, సెఫాడ్రాక్సిల్ ప్రోబెనెసిడ్, సెఫ్యూరాక్సిమ్ సెరాటియోపెప్టిడేస్‌లపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నిషేధం విధించింది.






