11 August, 2026 | 1:35 AM

యథేచ్ఛగా సెల్లార్ల తవ్వకం..

11-08-2026 12:13 AM
  1. కూలిన ప్రహరీ!
  2. వరద ముప్పున్నా ఆగని అక్రమ తవ్వకాలు
  3. హెచ్‌ఎండీఏ అనుమతుల పేరుతో దబాయింపులు.. 
  4. మహాలక్ష్మి డెవలపర్స్‌పై కేసు నమోదు

ఎల్బీనగర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనలను అక్రమార్కులు నీరుగారుస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముం దే ప్రమాదకర సెల్లార్ తవ్వకాలను నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులు జారీ చేసి నప్పటికీ, ఇక్కడ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎలాంటి భద్రతా ముందస్తు చర్యలు తీసుకోకుండా రాత్రింబవళ్లు పనులు చేస్తుండటంతో పక్కనున్న భవనాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

భారీ బ్లాస్టింగ్స్.. అధికారుల అలసత్వం..

భవన నిర్మాణ స్థలాల్లో పెద్ద బండరాళ్లను తొలగించడానికి ఎలాంటి అనుమతులు లేకుండా విపరీతంగా బ్లాస్టింగ్స్ నిర్వహిస్తున్నారు. భయానక శబ్దాలతో స్థానికులు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు. ఈ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టి, రాళ్లను అక్రమంగా విక్రయిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పనులపై ప్రశ్నించడానికి వెళ్తే హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎస్వో టీం, మైనింగ్, టౌన్ ప్లానింగ్, జీహెచ్‌ఎంసీ అధికారులు అటువైపు చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కూలిన శ్రీ అంబికా రెసిడెన్సీ గోడ....

గడ్డిఅన్నారం డివిజన్ కృష్ణవేణి నగర్ కాలనీలో మహాలక్ష్మి డెవలపర్స్ నిర్మిస్తున్న భారీ భవన సెల్లార్ తవ్వకాల్లో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో, వర్షాలకు సెల్లార్ అడుగుభాగం మట్టి జారి పక్కనే ఉన్న శ్రీ అంబికా రెసిడెన్సీ అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూలిపోయింది.

ముందే హెచ్చరించినా ఉపేక్ష....

ఈ ప్రమాదంపై జులై 23నే అపార్ట్మెంట్ వాసులు మున్సిపల్ జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగానే గురువారం ప్రహరీ గోడ కూలిపోయి అపార్ట్మెంట్ పునాదులకు ముప్పు ఏర్పడింది. ఈ ఘటనపై మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అపార్ట్మెంట్ వాసులతో కలిసి జోనల్ కమిషనర్ వికాస్ మహతోతో పాటు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోలీస్ కేస్ నమోదు.. తెరచాటు బేరసారాలు?

ఫిర్యాదుపై స్పందించిన జోనల్ కమిషనర్ వికాస్ మహాతో, గతంలోనే ఫిర్యాదు వచ్చినా చర్యలు తీసుకోని టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మహాలక్ష్మి డెవలపర్స్పై వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే, కేసు నమోదైన వెంటనే మహాలక్ష్మి డెవలపర్స్ ప్రతినిధులు టౌన్ ప్లానింగ్ అధికారులతో తెరచాటు బేరసారాలు ప్రారంభించారని, ‘అంతా సద్దుమణిగింది’ అని బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం.

 కఠిన చర్యలకు స్థానికుల డిమాండ్

ప్రస్తుతం వర్షాలు తీవ్రమవుతుండటంతో అపార్ట్మెంట్ల పునాదులు దెబ్బతిని పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ సెల్లార్ తవ్వకాలను తక్షణమే నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.