కొత్తపల్లి బ్రిడ్జిపై అప్రోచ్ రోడ్డు ఇంకెప్పుడు?
- వారం రోజుల్లో అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించాలి
- లేకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా
- ప్రతిపక్షాలను తిట్టడం మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టండి
- మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
పాపన్నపేట, ఆగస్టు10 (విజయ క్రాంతి) : మెదక్ నుంచి బొడ్మట్పల్లి వెళ్లే ప్రధాన మార్గంలోని కొత్తపల్లి వద్ద బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బ్రిడ్జిపై అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాపన్నపేట మండల నాయకులతో కలిసి కొత్తపల్లి వద్ద బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులతో మాట్లాడి, బ్రిడ్జి వద్ద ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.1.40 కోట్లతో కొత్తపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు, మూడేళ్లు కావస్తున్నా బ్రిడ్జిపై అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పదవిలోకి వచ్చి రెండేళ్ల తొమ్మిది నెలలు గడిచినా కొత్తపల్లి బ్రిడ్జిపై కనీసం అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు.
అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో మెదక్‌బొడ్మట్పల్లి మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్రిడ్జి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి పట్టదా? అని ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్, ఆర్‌అండ్బీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను తిట్టడం మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలన్నారు. రాజకీయ విమర్శలకు సమయం కేటాయించే బదులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు.
వారం రోజుల్లోగా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజల సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వీరి వెంట మాజీ సర్పంచ్లు శ్రీనాథ్రావు, బద్రి మల్లేశం, నాయకులు సోములు, దుర్గయ్య, అనిల్రెడ్డి, బాబాగౌడ్, శ్రీనివాస్గౌడ్, మేడిశెట్టి రాము, దండం సామేల్, మల్లేశం, చంద్రన్న తదితరులున్నారు.






