11 August, 2026 | 2:48 AM

ప్రభుత్వాలు మారుతున్నా గ్రామాల తలరాతలు మారడం లేదు..!

11-08-2026 01:30 AM

అత్యవసర సేవలు అందని వైనం...

కోటపల్లి, ఆగస్టు 10: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారాం గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల కష్టాలు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. రాజారాం, కావరి కొత్తపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడం, చిన్న వర్షానికే రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిత్యవసరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు గ్రామాలకు చేరుకోవడమే కష్టంగా మారింది. కనీసం రేషన్ బియ్యం సైతం సకాలంలో అందుకోలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో సేవలు సైతం అందని పరిస్థితి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించేందుకు, ఏదైన ప్రమాదం జరిగిన, విశాఖ కీటకాల బారిన పడ్డ సమయాల్లో 108 వాహనం సైతం గ్రామాలకు చేరుకోలేని దుస్థితి నెలకొంది. రోడ్డు అధ్వానంగా ఉండటంతో అత్యవసర వైద్య సేవలు కరువు అవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నా ఈ రెండు గ్రామాల రోడ్డు పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఇలాకాలోనే కనీస రహదారి సౌకర్యం లేకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రాజారాం, కావరి కొత్తపల్లి రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి పక్కా రహదారి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.