మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం..
కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతాం : ఆది శ్రీనివాస్
కోనరావుపేట ఆగష్టు 10 (విజయక్రాంతి):మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా మార్చడమే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గొల్లపల్లిలో మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించిన ఆయన, మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.ఇళ్లులేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.అనంతరం వట్టిమల్ల మూలవాగు, వర్షాలకు దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు.
నిమ్మపల్లి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనరావుపేట మండలంలో పెంటి వాగు, మూలవాగుపై వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ నర్సయ్య యాదవ్, మండల అధ్యక్షులు మానుక సత్యం, స్థానిక సర్పంచ్ ఆమని శ్రీకాంత్, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






