జోగులాంబ సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ
- ఆలయాన్ని సందర్శించిన విజయక్రాంతి డైరెక్టర్ సౌమ్య
- జోగులాంబ, పాపనాశేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు
గద్వాల (విజయక్రాంతి)/అలంపూర్, ఆగస్టు 10: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీ జోగులాంబ అమ్మవారి క్షేత్రం నవబ్రహ్మాలయాల దివ్యధామం అలంపూర్ సోమవారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విజయక్రాంతి డైరెక్టర్ సౌమ్య సోమవారం అలంపూర్‌ను సందర్శించి శ్రీ జోగులాంబ అమ్మవారిని, శ్రీ పాపనాశేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న సౌమ్యకు ఆలయ సిబ్బంది సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో అభిషేక పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు చేశారు.
అనంతరం నవబ్రహ్మాలయాల్లో ప్రధానమైన శ్రీ పాపనాశేశ్వర స్వామి ఆలయాన్ని సౌమ్య దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. అలంపూర్‌లోని ప్రాచీన ఆలయాల శిల్పకళ, నిర్మాణ వైభవం, చారిత్రక ప్రాశస్త్యాన్ని ఆసక్తిగా తిలకించారు.
ప్రాచీన క్షేత్రం.. అపూర్వ శిల్పకళ
అలంపూర్ కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా, శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ప్రాచీన దేవాలయాల సమాహారమని సౌమ్య పేర్కొన్నారు. జోగులాంబ అమ్మవారి దర్శనం, పాపనాశేశ్వర స్వామివారి ఆలయ సందర్శన తనకు ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. సౌమ్యతో పాటు ఆమె మిత్రులు అనూష, గాయత్రి, సాధ్వి తదితరులు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.






