దేశవ్యాప్తంగా 17 మంది మావోయిస్టులు
- వారందరూ లొంగిపోవాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కర్రెగుట్టలను మొదటిసారిగా సందర్శించిన అధికార యంత్రం
- 50 సంవత్సరాల అనంతరం అరుదైన ఘట్టం
- జెండా ఆవిష్కరించి.. జాతీయ గీతం ఆలాపన
ములుగు, ఆగస్టు 10 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో ఇంత కాలం దట్టమైన అటవీ ప్రాంతం, అన్నలకు ఆలవాలంగా నిలుస్తున్న కర్రెగుటల్లో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు సంచలన సంఘటనలకు వేదికగా మారిన కర్రెగుట్టలను 50 సంవత్సరాల అనంతరం మొట్టమొదటిసారిగా సోమవారం ప్రభుత్వ అధికారులు చేరుకొని జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు.
డీజీపీ సీవీ ఆనంద్ మొట్టమొదటిసారిగా రోడ్డు మార్గాన కర్రెగుట్ట ప్రాంతాలకు చేరుకున్నారు. మురుమూరు ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్ కాంప్ చేరుకొని అక్కడి నుంచి దట్టమైన అడవిలో 12 కిలోమీటర్లు ప్రయాణించి మురుమూరు చేరుకున్నారు. అక్కడ నివసిస్తున్న ఎనిమిది కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, బియ్యం అందజేశారు. అనంతరం 23 కిలోమీటర్ల దూరంలో అత్యంత దట్టమైన అడవిలో ఉన్న గిరిజన గ్రామాలకు చేరుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్ సెంట్రల్ కమిటీతో పాటు అన్ని ర్యాంకుల క్యాడర్లు లొంగిపోవడం, మరికొందరు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని చెప్పారు. తెలంగాణ మావోయిస్టు రహిత ప్రాంతంగా మిగిలిందన్నారు. లొంగిపోయిన సెంట్రల్, స్టేట్ కమిటీ మావోయిస్టులకు రివార్డులు అందజేయడంతో పాటు రివార్డు లేని వారికి సైతం ప్రోత్సాహంగా అందించామని తెలిపారు.
దేశవ్యాప్తంగా మరో 17 మంది మావోయిస్టు ఉన్నట్టు సమాచారం అందిందని, వారిలో ముప్పాలు లక్ష్మణరావు కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నారని చెప్పారు. వారు లొంగిపోతే సహకరించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందజేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో అభివృద్ధిలో కాస్త ఆలస్యం జరిగినా, కనీస అవసరాలు వైద్య సౌకర్యాలు, నీటి వసతి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఫారెస్ట్ అధికారి, గ్రేహౌండ్స్, ఎస్‌ఐబి దళాలు సంయుక్త సహకారంతో అభివృద్ధి మరింత మెరుగుపడుతుందని తెలిపారు.






