రామ మందిరంలో అవినీతి ఘనత బీజేపీదే
లక్సెట్టిపేట, ఆగస్టు 10 :అయోధ్య రామమందిర నిర్మాణంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన చరిత్ర బీజేపీ నాయకులదేనని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు విమర్శించారు. సోమవారం పట్టణంలోని ఐబీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 ఏండ్లుగా నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి బీజేపీ నాయకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వాట్సాప్ యూనివర్సిటీ, అంధ భక్తులు బీజేపీ నాయకులుగా చలామణి అవుతున్నారని ఏద్దేవా చేశారు.
దేశంలో చదువు, భక్తి, ఐక్యత ఉన్నచోట బీజేపీ అధికారంలో లేదని పలు ఉదాహరణలతో వివరించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను అజ్ఞానంలో ఉంచి రాజ్యమేలాలని చూస్తోందన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కోట్ల నిధులు వెచ్చించి రోడ్లు, మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసిన ఘనత దివాకర్ రావుదేనని గుర్తు చేశారు. జిల్లా ఏర్పాటు,మెడికల్ కాలేజ్ లాంటి నిర్మాణాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని వివరించారు.
ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఎమ్మెల్యే కావాలని అనుకుంటే ప్రజలకు మేలు జరిగేలా పని చేయాలని నాయకులు సూచించారు. 30 ఏండ్ల కిందటి పరిస్థితిని మరచి మాట్లాడటం బీజేపీ నాయకునికే చెల్లుతుందని వ్యంగంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్లు తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ తిరుపతి, నాయకులు పురుషోత్తం, చాంద్, ప్రభాకర్, బాపు తదితరులు పాల్గొన్నారు.






