11 August, 2026 | 2:47 AM

మత్స్యకారులకు భరోసా!

11-08-2026 12:25 AM
  1.    4.21లక్షల మందికి గ్రూప్ ప్రమాద బీమా 
  2. రాష్ట్ర వాటాగా రూ.1.34 కోట్లు చెల్లింపు
  3. ఈ ఏడాది జూన్ 1 నుంచి వర్తింపు
  4. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భద్రతే లక్ష్యం
  5. పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి   

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. పెండింగ్‌లో ఉన్న ప్రమాద బీమాకు మోక్షం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేయడానికి ఆమోదం తెలిపింది.

ఒక్కో లబ్ధిదారుడికి రూ.79.96 బీమా ప్రిమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,34,79,673 చెల్లించిందని రాష్ట్ర పశుసంవర్ధక  శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ పథకం 18 నుంచి 70 సంవత్సరాల వయసు కలిగిన వారికి వర్తింస్తుందన్నారు. అర్హులైన మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని మంత్రి స్పష్టం చేశారు.

2026 జూన్ 1 నుంచి పాలసీ కాలం అమల్లోకి వస్తుందని తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రమాద సమయంలో అండగా నిలవడంతో పాటు, వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో  గ్రూప్ ప్రమాద బీమా పథకం కీలకమైందన్నారు.  

పథకం ద్వారా ప్రయోజనాలు

* ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ. 5 లక్షలు 

* శాశ్వత సంపూర్ణ వైకల్యానికి  రూ. 5 లక్షలు 

* శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ. 2.50 లక్షలు 

* ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందితే గరిష్టంగా రూ. 25,000 వరకు వైద్య సదుపాయం