‘క్యూర్’లో ఇండ్ల గడువు పెంపు
- 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
- వరుస సెలవుల నేపథ్యంలో నిర్ణయం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడి
- ఇప్పటి వరకు 46,121 దరఖాస్తులు వచ్చినట్లు స్పష్టీకరణ
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం మరో ఐదు రోజులు పొడిగించింది. ఈ నెల 15వ తేదీ శనివారం వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

విలువైన ప్రభుత్వ భూముల్లో ఉచితంగా పేద, మధ్య తరగతి ప్రజలకు నామమాత్రపు ధరలో సొంతింటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం ద్వారా లక్ష ఇండ్లు నిర్మిస్తున్నామని, పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణాన్ని చేప ట్టామని వివరించారు.
ఇందిరమ్మ ఇండ్ల టవర్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అయితే రెండో శనివారం, బోనాల పండుగ తదితర వరుస సెలవుల కారణంగా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మే రకు దరఖాస్తు గడువు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు మంత్రి వెల్లడించారు.
జూలై 21 నుంచి మీసేవ కేం ద్రాలతో పాటు ఆన్‌లైన్, వాట్సాప్‌ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, తొలుత ప్రకటించిన గడువు ఈనెల 10వ తేదీ సాయంత్రం నాటికి మొత్తం 46,121 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.
గడువు పెంచినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని.. అపోహలు, అనుమానాలకు తావుండదని మంత్రి స్పష్టం చేశారు.






