కారు ఢీకొని ఇద్దరు మృతి
ద్విచక్ర వాహనదారులను ఈడ్చుకెళ్లిన కారు
ఉప్పల్, మే 13 (విజయక్రాంతి): నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం మీద పయనిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వివరాలకు వెళ్తే మౌలాలికి చెందిన గణేష్, గంగాధర్ కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు.
పని నిమిత్తం మల్లాపూర్ పారిశ్రామికవాడలోని పని చేసుకుని మంగళవారం రాత్రి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో స్వాగత్ కన్వెన్షన్ వద్ద అతివేగంతో దూసుకొచ్చిన టీఎస్03ఎఫ్‌జి-0147 ఐ10 కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో గంగాధర్, గణేష్ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు సంఘటన స్థలాల చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాచారం పోలీసులు తెలిపారు. అతివేగంతో మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు డ్రైవర్ని అతనితో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం నాచారం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. కూలీపనులు చేసుకొని జీవించే తాము పెద్ద దిక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.






