14 May, 2026 | 2:05 AM

రైతులను దోపిడీ చేస్తే సహించం

14-05-2026 01:04 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 13 (విజయక్రాంతి): తాలు,తడక పేరుతో రైతులను దోపిడికి గురి చేస్తే ఎంత మాత్రం సహించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైస్ మిల్లర్లను హెచ్చరించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ధాన్యం, మక్కల కొనుగోళ్లపై రెవెన్యూ, సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, గ్రామీణ అభివృద్ధి, సహకార, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో పాటు రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసి, కాంటా పూర్తి చేసిన తర్వాత ట్రక్ షీట్ ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రక్షిత్ జారీ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత సరిగా లేదని, తాలు ఉందని అబద్ధాలు ఆడొద్దని, రైతుల నోళ్లు కొట్టే ప్రయత్నాలు చేస్తే మేలు జరగదని పేర్కొన్నారు. వరి కోత యంత్రాల యజమానులతో సమావేశం నిర్వహించి, తాలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు పూర్తి చేసిన తర్వాత కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని, రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రవర్తించవద్దని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దాన్యం, మక్కల కొనుగోళ్ళను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, క్షేత్రస్థాయిలో ఆ విధంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రభుత్వానికి సహకరించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దాన్యం, మక్కల రవాణాలో ఇబ్బందులు కలిగిస్తే కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లర్ల వద్ద ధాన్యం దిగుమతి పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు. ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్ఓ వసంతకుమారి, సివిల్ సప్లై అధికారులు కిరణ్ కుమార్, రాములు, డీఏవో బాబురావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, డిఆర్డిఓ బాలకృష్ణ, సహకార అధికారి వాలియా నాయక్, డిపిఓ శ్రీలత పాల్గొన్నారు.