14 May, 2026 | 1:39 AM

కలెక్టర్ల కల్లాల బాట!

14-05-2026 01:02 AM

సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం 

ధాన్యం, మక్కల కొనుగోలులో జాప్యం జరగొద్దని ఆదేశం

మహబూబాబాద్, మే 13 (విజయక్రాంతి): ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతులను ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో కలెక్టర్లు కల్లాల బాట పట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడుతూ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం నాణ్యతను, తేమశాతాన్ని పరిశీలించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోల్లను వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను, మిల్లులను, గోదాములను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు.

అన్ని శాఖల సమన్వయంతో కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన దాన్యం, మక్కల కొనుగోళ్ళను త్వరితగతిన పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడ కూడా ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదంటూ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉన్న ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, కాంటా పూర్తి చేసిన వెంటనే మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడ కూడా జాప్యం చేయకుండా ట్రక్ షీట్ జారీ చేయాలని, ధాన్యాన్ని మిల్లర్లు ఎలాంటి ఆంక్షలు లేకుండా దిగుమతి చేసుకునే విధంగా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పూర్తి చేసిన వెంటనే ఓపిఎంఎస్ లో నమోదు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా రైతులకు కొనుగోలు కేంద్రాల్లో నీడ, తాగునీటి వసతి కల్పించాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేయాలని కలెక్టర్లు ఆదేశించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల తీరును సమీక్షించారు. ఇక మహబూబాబాద్ లో మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్యా మురళి నాయక్, డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ములుగు జిల్లాలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ్ రావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా పరిశీలించారు.