24 May, 2026 | 1:26 AM

గిరిజన రైతుల జిన్నింగ్ మిల్లు

24-05-2026 12:10 AM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గ్రామాల రైతులు సంఘటితంగా మారి జిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేసి, లాభాల బాట పట్టిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని 837 మంది రైతులు సంఘటితమై, ప్రతి రైతు తమవంతుగా వాటా కింద 33.30 లక్షల రూపాయలను జమ చేశారు.

ఏడీసీసీ బ్యాంక్ సహకారంతోపాటు నాబార్డ్ సహకారంతో ఇంద్రవెల్లి మండలం ఏమైకుంట గ్రామ శివారులో జిన్నింగ్ మిల్ ఏర్పాటు చేశారు. 2020  జిన్నింగ్ మిల్లును ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం వరకు 10 కోట్ల టర్నోవర్ ఈ రైతు ఉత్పాదక సంఘం చేసింది. జిన్నింగ్ మిల్లులో రైతులు పండించిన పత్తి పంటతో పాటు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసే అధికారులను ఒప్పించారు. 2021  ఆర్థిక సంవత్సరం వరకు 8.12 కోట్ల టర్న్ అవుట్ సాధించగా.. 2025- సంవత్సరంలో 2.73 కోట్ల టర్నోవర్ సాధించింది. 

ఇంద్రవెల్లిలో రైతు ఉత్పాదక సంఘం ఏర్పాటు చేసిన జిన్నింగ్ మిల్లును పరిశీలనకు, ఇక్కడి రైతుల కృషి, శ్రమను తెలుసుకునేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశం నుంచి రైతులు ఇక్కడికి వచ్చి, వివరాలు తెలుసుకుంటున్నారు. నాబార్డ్ జాతీయ అధికారులు జిన్నింగ్ మిల్లుపై ఆయా రాష్ట్రాల రైతుల సమావేశంలో ఇంద్రవెల్లి మండల రైతుల మిల్లు గురించి అక్కడి రైతులకు వివరిస్తున్నారు. ఇంద్రవెల్లిలో ఏర్పాటుచేసిన జిన్నింగ్ మిల్లును ఆదర్శంగా తీసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్, నార్నూర్, జై నూర్, తిర్యాని మండలాల్లోనూ గిరిజన రైతులు సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

2016లో ఇంద్రవెల్లి మండలంలోని పలు గిరిజన గ్రామాల రైతులు గ్రామస్థాయిలో సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్థాయి సంఘాల నుంచి మండల స్థాయి సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రైతు తన వాటా కింద వెయ్యి రూపాయలను షేర్ క్యాపిటల్‌గా జమ చేశారు. ఏటా ఒక రైతు తన షేర్ క్యాపిటల్‌గా వెయ్యి రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. రైతుల షేర్ క్యాపిటల్‌తో పాటు జిన్నింగ్ మిల్లు వచ్చిన లాభాలను సైతం బ్యాంకుల్లో భద్రపరుస్తున్నారు. సంఘంలో సభ్యుడిగా చేరిన రైతుకు కష్ట కాలం లో సంఘం తరఫున ఆదుకుంటున్నారు. ప్రతి మూడేళ్లకొకసారి సంగం ఎన్నికలు నిర్వహించి సంఘం అభివృద్ధికి పని చేసే వారిని  చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా ఎన్నుకుంటున్నారు.

జిన్నింగ్ మిల్లులోనే ఎరువులు..

ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంఘం ఆధ్వర్యంలో రైతులకు కావలసిన ఎరువులు, విత్త నాలను సరఫరాచేస్తున్నారు. బయట మార్కె ట్ కంటే నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సైతం రూ.10 తక్కువకే సభ్యులకు అందజేస్తున్నారు. డబ్బులులేని రైతులను గుర్తించి వారికి సైతం పంట చేతికి వచ్చేవరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతినెలా రైతులు ఎన్నుకున్న పాలకవర్గం సమావేశమై సంఘ సభ్యులకు వారికి అవసరమైన వాటిని సమకూర్చేందుకు నిర్ణయించుకుంటున్నారు.

జిన్నింగ్ మిల్లులోనే దాల్ ఫ్యాక్టరీ

జిన్నింగ్ మిల్లులోనే దాల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. రైతులు పండించిన కందులను సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసి పప్పుగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. పప్పుపై వచ్చే లాభం సైతం సంఘంలోనే జమ చేస్తున్నారు. ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంఘం లాభాల బాటలో పయనించడంతో ఇతర ప్రాంతాల రైతులు సైతం ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంఘం పనితీరును సైతం జిల్లా ఉన్నతాధికారులు, నాబార్డ్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. 

 బండారి లక్ష్మీనర్సయ్య 

(ఉట్నూర్, విజయక్రాంతి)