బీఆర్‌ఎస్ బ్లాక్‌మెయిలింగ్
రాష్ట్ర అభివృద్ధి కావాలా.. వద్దా?
ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనడం తెలంగాణకు ద్రోహమే!
- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌గా ఫ్యూచర్ సిటీ
- పరిశ్రమలు రాకుండా, యువతకు ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా?
- ప్రతిపక్షంగా నిర్మాణాత్మక విమర్శలు చేయాలి
- బీఆర్‌ఎస్ నాయకుల కుట్రలను సహించబోం
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా సున్నా చుట్టారని, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో నూ పాతాళానికి తొక్కినా బీఆర్‌ఎస్ వారికి బుద్ధి రాలేదు సరికదా.. మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు.
హరీష్ రావు అమెరికా వెళ్లి, బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకు లు ‘చీప్ పాలిట్రిక్స్’.. ‘డైవర్షన్ పాలిట్రిక్స్’.. ‘బ్లాక్ మెయిలింగ్ పాలిట్రిక్స్’ ప్లే చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులకు రాష్ట్రం అభివృద్ధి కావాలని ఉందా? లేదా అని ప్రశ్నించారు.
మొన్నటివరకు బీఆర్‌ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనను అడ్డుకునే కుట్ర చేశారు. ఇప్పుడు.. ఫ్యూచర్ సిటీపై కుట్రలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ.. అభివృద్ధిని అడ్డుకునే వినాశకరమైన ఆలోచనలు చేయకూడదని హితవు పలికారు. రాజకీయాలు తాత్కాలికం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు ఎన్నికల ఓటమి తాలూకు నిరాశ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారని అన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని స్పష్టం చేశారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక ప్రభుత్వానికో పరిమితమైనది కాదని.. తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు తాము వేసే ఒక ముందడుగు అని వెల్లడించారు. ‘రాబోయే రోజుల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌గా మారబోతోంది. దీన్ని రద్దు చేస్తామని పగటి కలలు కంటున్న హరీష్ రావుకు, బీఆర్‌ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
ప్రభుత్వం మారితే ఫూచర్ సిటీని రద్దు చేస్తాం అనే బాధ్యతారహిత ప్రకటన చేయడం ద్వారా హరీష్‌రావు అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను, ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారు. ఇది ‘తెలంగాణ’కు చేస్తున్న ద్రోహం కాదా?’ అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
‘గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా తెలంగాణ ఎదుగుతోన్న క్రమంలో.. ‘మేము అధికారంలోకొస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం’ అంటూ పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారా? తెలంగాణలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలనుకుంటున్నారా? మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రయోజనాల కంటే మీ రాజకీయ స్వార్థమే ఎక్కువైందా?’ అని ప్రశ్నించారు.
ఒక అంతర్జాతీయ సంస్థ వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి మన రాష్ట్రానికి వచ్చేటప్పుడు.. ప్రతిపక్షంలో ఉన్న మీరు ‘మేమొస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం’ అని బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తే, ఆ కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోవా? అని ఆయన నిలదీశారు.
ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రాజెక్టులు రద్దు చేస్తే ఎలా?
రాజకీయం కోసం ఒక అంతర్జాతీయ ప్రాజెక్టును రద్దు చేస్తామనడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని, ప్రభుత్వం మారినప్పుడల్లా పాత ప్రాజెక్టులను రద్దు చేసుకుంటూ పోతే, అసలు అభివృద్ధి అనేది జరుగుతుందా? అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులు మొదలైనప్పుడు.. అప్పుడు కూడా అప్పటి ప్రతిపక్షాలు ‘ఇవన్నీ రియల్ ఎస్టేట్ దందాలు, స్కాములు’ అంటూ విమర్శించాయని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా ఎయిర్‌పోర్ట్, ఓఆర్‌ఆర్‌ను రద్దు చేసిందా? ఆ రోజు ఆ ప్రాజెక్టులు వచ్చాయి కాబట్టే కదా.. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఇంత అభివృద్ధి జరిగింది? అని ఆయన స్పష్టం చేశారు.
1992 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌కు పునాది వేసిందని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రద్దు చేయలేదు కదా అని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని మొదలుపెడితే.. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయకుండా ఇంకో అడుగు ముందుకేసి మరింత డెవలెప్ చేశామని, అప్పుడు వేసిన పునాదుల వల్లే.. ఇప్పుడు హైదరాబాద్ ‘గ్లోబల్ ఐటీ హబ్’గా ఎదిగిందన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
1990లలో కంప్యూటర్లు వస్తే.. ఇప్పుడు ఏఐ యుగం నడుస్తోందని, నాడు హైటెక్ సిటీ ఎలాగో.. రేపటి తరం కోసం ఈ ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ కూడా అలాగేనని స్పష్టం చేశారు. మారుతున్న కాలంతో పాటు మనం మారకపోతే రేపు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు మనకంటే ముందుకు దూసుకుపోతుంటే, మనం ఇంకా పాత కాలంలోనే ఉండిపోదామా అని నిలదీశారు.
మెట్రో రైలుకు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన అభివృద్ధి తప్ప బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదన్నారు. జంట నగరాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని చార్మినార్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ చేస్తామంటే అడ్డకుంటున్నారని, బుల్లెట్ రైలు తీసుకొస్తామంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీపై హరీష్, కేటీఆర్, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు చేసే కుట్రలను మేం సహించబోమని హెచ్చరించారు.
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంటే.. ఓర్వలేక, రాక్షుసుల్లా అడ్డుపడుతున్నారని, తప్పుడు ప్రచారంతో మమ్మల్ని బద్నాం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిందని, హైకోర్టుకు కూడా ఇదే విషయాన్ని తెలియజేశామని తెలిపారు.
ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ‘లైఫ్ సైన్సెస్’ పార్కును ఏర్పాటు చేస్తామని, ఫార్మా పేరిట కాలుష్యాన్ని వెదజల్లాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని, మా ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుందన్నారు. కాలుష్యం లేకుండా ఫార్మా సంస్థలను ఏర్పాటు చేస్తామని, ‘గ్రీన్ ఫార్మా’కు మేం కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.
మైగ్రేషన్‌కు అనుగుణంగా..
మూసీ నది ప్రక్షాళన సమయంలో పేదవాడికి నష్టం జరిగితే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి చెప్పారు. మూసీ నది ప్రక్షాళన జంట నగరాలకు వరమని, అందులోని నీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళనను బీఆర్‌ఎస్ పార్టీ, వారి మిత్రపక్షమైన బీజేపీతో కలిసి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర్ అండర్ గ్రౌండ్ రోడ్లను ఏర్పాటుచేస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రజలు కోరుతున్నదే సీఎం, తాము చేస్తున్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటీని ఏర్పాటుచేయాలని చూస్తున్నామని, వాటిని కూడా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రేషన్ దృష్టిలో పెట్టుకుని తాగునీరు, రోడ్లు, ట్రాన్స్‌పోర్టేషన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రతిపక్షం అయినా.. మీపై ఆ బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా తెలంగాణ యువతకు అన్యాయం చేయవద్దని కోరారు. మీరు ప్రభుత్వంలో ఉండి యువతకు అన్యాయం చేశారని, ఇప్పడు ప్రతిపక్షంలో ఉండి అన్యాయం చేయవద్దని సూచించారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేస్తారా? దీనిపై హరీష్‌రావు సమాధానం చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.






