యాదాద్రిలో అభివృద్ధి పనులు
- టెంపుల్ సిటీ పరిధిలో 99.55 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు
- యాదగిరి గుట్టలో అతిపెద్ద వేద పాఠశాల
- కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి సీఎం భూమిపూజ
- రూ.43.80 కోట్లతో 15 ఎకరాల్లో నిర్మాణం
- ఆశ్రమంలో 300 మంది విద్యార్థులకు వసతి
యాదాద్రి భువనగిరి/యాదగిరిగుట్ట, మే 23 (విజయక్రాంతి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యా దగిరిగుట్టలో రూ.99.55 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి శనివారం శంకుస్థాపనలు చే శారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు యాదాద్రి వచ్చిన సీఎం.. మొదట స్వా మివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రధానార్చ కు లు, వేద పండితులు, అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. దేవాదాయ ప్రి న్సిపల్ సెక్రటరీ, కమిషనర్, దేవస్థానం ఈవో స్వామివారి చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట టెంపుల్ సిటీకీ చేరుకొని, దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి భూమిపూజ చేశారు.
వేద పాఠశాలతో పాటు టెంపుల్ సిటీ పరిధిలో 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రూ.43.80 కోట్ల అం చనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ వేద పాఠశాలలో సంప్రదా య ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందిం చనున్నారు.
ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక శాలలతో పాటు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వేద పాఠశాలకు భూమిపూజతో పాటు 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణం, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ.9.87 కోట్లతో భారీ కల్యాణ మండపం, భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ. 1.41 కోట్లతో రక్షణ పైకప్పు నిర్మాణం, రథశాల వైపు వాయవ్య దిశలో ఉ న్న మాడవీధులకు అనుసంధానంగా రూ.1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
15 నిమిషాలు ఛాపర్‌లోనే సీఎం
సీఎం, మంత్రుల హెలికాప్టర్ నిర్దేశిత వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ, అక్కడ వారికి స్వాగతం పలికేందుకు కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ప్రొటోకాల్ లోపం, అధికారుల సమన్వయం లేని కారణంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు 15 నిమిషాల పాటు ఛాపర్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీ పర్యటనలో జిల్లా యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సచివాలయ వర్గాలు సీరియస్ అయినట్లు సమాచారం.






