24 May, 2026 | 2:04 AM

మీడియా నిత్యం ప్రజాపక్షమే ఉండాలి

24-05-2026 12:48 AM
  1. నేటి సవాళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  2. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన
  3. జర్నలిస్ట్ వల్లీశ్వర్‌కు గోరా శాస్త్రి ఉత్తమ జర్నలిస్టు పురస్కారం

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): సంచలనాలకు దూరంగా, సత్యానికి దగ్గరగా జర్నలిజం ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. శనివారం హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో నవ సాహితీ ఇంటర్నేషనల్, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన గోరా శాస్త్రి స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కార ప్రదానానికి హాజరై,  ప్రముఖ జర్నలిస్ట్ జి వల్లీశ్వర్‌కు పురస్కారాన్ని ప్రదానం చేసి ప్రసంగించారు.

‘మీడియా బాధ్యతాయుతంగా ఉండాలి. బ్రేకింగ్ న్యూస్ పేరుతో న్యూస్‌ను బ్రేక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మీడియా నాలుగో మూలస్తంభం. సమాజంలో ముఖ్యమైన వ్యవస్థలైన శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిని దాటినప్పుడు లేదా దారి తప్పినప్పుడు, ప్రజాపక్షం వహించి వాటిని హెచ్చరించి, సరైన మార్గంలో పెట్టే గురుతర బాధ్యత మీడియాదే. నేడు ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది.

యుద్ధాలు, ఘర్షణలు, వాటి వల్ల తలెత్తుతున్న ఎన్నోసమస్యలు ప్రజల జీవితాలపై ప్రభావం  చూపే అవకాశం ఉంది. వీటిని ఎదర్కోవడానికి ప్రభుత్వాలు, మేధావులు ఎన్నో చర్యలు తీసుకుంటుంటారు. వీటిపై ప్రజలను చైతన్య పరిచి, వారిలో అవగాహన కల్పించి సమస్యల తీవ్రతను తగ్గించే గురుతర బాధ్యత మీడియా ఉంది. అగ్గిరాజుకున్నప్పుడు ఆర్పడానికి ప్రయత్నించాలి కానీ, దానికి ఆజ్యం పోయకూడదు’ అని సూచించారు. ‘శ్రీ గోరా శాస్త్రి తెలుగు పత్రికా రచనలో, సాహితీ రచనలో ఆజానుబాహుడు. 

నిజాన్ని నిర్భయంగా, నిష్కర్షగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పి, సునిశిత విమర్శతో హాస్యాన్నీ, వ్యంగాన్నీ, ధర్మాగ్రహాన్నీ, సాహితీ వైదుష్యాన్నీ సమపాళ్లలో మేళవించే గోరాశాస్త్రి సంపాదకీయాలంటే పాఠకులు చెవి కోసుకునేవారు. నేటితరం పాత్రికేయులు గోరా రచనలను చదవాలి’ అని చెప్పారు. వల్లీశ్వర్ ప్రతిభావంతుడైన జర్నలిస్ట్ అని, మానవ  సంబంధాల విలువ తెలిసిన జర్నలిస్టు అని అన్నారు. 

కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గోవిందరాజు చక్రధర్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.