24 May, 2026 | 2:04 AM

హైదరాబాద్‌లో న్యాయవాదిదారుణ హత్య

24-05-2026 12:43 AM
  1. వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్న ఖాజా మొయిజుద్దీన్‌ను కారుతో ఢీకొన్న దుండగులు
  2. హైదరాబాద్ మాసబ్ ట్యాంట్‌లో ఘటన
  3. పథకం ప్రకారమే చంపేశారు: కుమారుడు ఫర్హాన్

సికింద్రాబాద్, మే 23 (విజయక్రాంతి): హైదరాబాద్ మాసబ్ ట్యాంకులో శనివారం ప్రముఖ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ను దుండగులు కారుతో ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం మొయినుద్దీన్ కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు. శనివారం మాసాబ్ ట్యాంకు వద్ద తన కారు ఎక్కుతుండగా వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. అనంతరం కారును ఆపకుండా దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్రంగా గాయపడిన మొయిజుద్దీన్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పథకం ప్రకారమే తమ తండ్రి హత్య జరిగినట్లు కుమారుడు ఫర్హాన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫర్హాన్ మీడియాతో మాట్లాడుతూ.. హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలంఖాన్, ఆజం ఖాన్ అని ఆరోపించారు. ‘వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు కొన్ని దశాబ్దాలుగా మా తండ్రి పోరాటం చేస్తున్నాడు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆలం ఖాన్, అతడి తండ్రి ఆక్రమించి కాలేజీలు నిర్మించారు.

వాటి గురించి ఎప్పటి నుండో  కేసులు వేస్తూ మొయిజుద్దీన్ పోరాటం చేస్తు న్నారు. ఆరు నెలల క్రితం అలంఖాన్ మా ఆఫీసుకు వచ్చి నన్ను బెదిరించాడు. గతంలో నూ ఆఫీసులకు వచ్చి దాడులు చేశారు. మా తండ్రిపై దాడి జరగడం ఇది ఆరవసారి. నాకు, నా కుటుంబానికి రక్షణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి’ అని ఫర్హాన్ కోరారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడం కోసం ఐదో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. మొయిజుద్దీన్ కేసులో సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ సురేందర్‌రెడ్డి తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు.