పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు
- దేశంలోనే -మొదటిసారి ఐదు కోర్సులను ప్రవేశపెట్టిన సాంకేతిక విద్యాశాఖ
- ప్రతి నెలా విద్యార్థికి 9 వేల ఉపకార వేతనం
- ఇంటర్న్‌షిప్‌కు జూన్ 12 ఎంవోయూ
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులను సాంకేతిక విద్యాశాఖ తీసుకొస్తుంది. కొత్త కోర్సులకు డిమాండ్ పెరగడంతో ఆ దిశగా సాంకేతిక విద్యాశాఖ కీలక ముందడుగు వేసింది. కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా మరో వైపు కోర్సుల సిలబస్‌ను మార్చడంతోపాటు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్‌షిప్, ప్లేస్మెంట్స్ కల్పించనుంది. పాలిటెక్నిక్ ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్‌షిప్ చేస్తున్న విద్యార్థులకు నెలకు రూ.9 వేల ఉపకార వేతనం అందించనుంది.
ఇందులో నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీం (నాట్స్) రూ.7 వేలు అందించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేలు స్టుఫైండ్ అందజేయనుంది. డిప్లొమా కోర్సుల్లోని విద్యార్థులకు ఆరు నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తప్పనిసరి. స్టుఫైండ్‌ను విద్యార్థులకు అందించి ప్రోత్సహించాలన్న భావనతో సాంకేతిక విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
పభుత్వమిచ్చే రూ.2 వేల ప్రోత్సాహం కోసం రూ.30 కోట్ల కార్పస్ ఫండ్‌ను కూడా ప్రత్యేకంగా కేటాయించింది. ఇతర రాష్ట్రాల్లోని సంస్థల్లో చేరిన వారికి కూడా అప్రెంటిస్‌షిప్ కల్పిస్తారు. అయితే రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సౌకర్యం కల్పించే సంస్థలు 358 ఉండగా, వీటిలో నేషనల్ నాట్స్ లో చేరినవి 184 పరిశ్రమలుంటే, 174 పరిశ్రమలు నాట్స్‌లో చేరనివి ఉన్నాయి.
ఐదు కొత్త కోర్సులు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఐదు కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. అయితే ఈ ఐదు కోర్సులు దేశంలో ఏ రాష్ట్రంలో లేకపోవడం గమనార్హం. ఈ కోర్సులను అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కూడా రూపొందించలేకపోయింది. ఇలాంటి ఐదు కోర్సులను సాంకేతిక విద్యాశాఖ అధికారులు రూపొందించి ఏఐసీటీఈ అనుమతులు సాధించారు.
డిప్లొమా ఇన్ సెమికండక్టర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ మాన్యుప్రాక్చరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్, డిప్లొమా ఇన్ లాండ్ స్కేప్ డిజైన్, డిప్లొమా ఇన్ మల్టీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టింది. సహజంగా ఏఐసీటీఈ తాను రూపొందించిన జాబితాలోని కోర్సులకు అనుమతినిస్తుంది. కానీ తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ రూపొందించిన కోర్సులను అనుమతినివ్వడం విశేషం.
భవిష్యత్తులో ఈ కోర్సును ఏఐసీటీఈ కూడా అడాప్ట్ చేసుకునే అవకాశాలున్నట్లు విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు.- పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లకు ఐఐటీ హైదరాబాద్ చేత ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాముల్లో శిక్షణనివ్వనున్నారు. ఫ్యాకల్టీ కొరత, కొత్త కోర్సు బోధనకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ విధానంలో ఇండస్ట్రీ నిపుణుల చేత పాఠాలు బోధించనున్నారు.
-డిప్లొమాలోని ప్రతి కోర్సులో 30 -40 శాతం సిలబస్ మార్చారు. ఏఐ, ఐటీవో, పైతాన్, డిజైన్ థికింగ్ వంటి మోడ్రన్ టెక్నాజీను అంతర్భాగం చేశారు. ఈ- ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మౌలిక వసతులకు గానూ మరమ్మతులు, రంగులేయడానికి రూ. 41 కోట్లు కేటాయించారు.
పరిశ్రమలతో జూన్ 12న ఎంవోయూ
- శ్రీదేవసేన, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్
ఏఐసీటీఈని ఒప్పించి ఐదు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాం. విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్స్ కల్పించడం ఇంటర్నషిప్ కల్పించేందుకు పరిశ్రమ వర్గాలతో జూన్ 12న సీఎం సమక్షంలో ఎంవోయూలు చేసుకోబోతున్నాం. పాలిటెక్నిక్‌లో పెను మార్పులు తీసుకొచ్చాం. కోర్సుల రూపురేఖలు మార్చేశాం.
ఈ కోర్సులు చేసే విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చేందుకు సాంకేతిక విద్యలో ఈ విధమైన మార్పులు చేశాం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 80 శాతం సీట్లు నిండుతున్నాయి. 100శాతం సీట్ల భర్తీని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది మరో నాలుగు వేల సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చాం.






