24 May, 2026 | 2:23 AM

రెండో విడతలో 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

24-05-2026 01:19 AM

గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్లు

పాలమూరు-రంగారెడ్డికి 587 కోట్లు

  1.   1న ఆసిఫాబాద్ జిల్లాలో ఇళ్ల మంజూరు కార్యక్రమం ప్రారంభం
  2. ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున పూర్తి చేసేందుకు నిధులు 
  3. హైదరాబాద్‌లో అల్పాదాయ వర్గాలకు లక్ష ఇళ్లు
  4. రాష్ట్రంలో ఇప్పటికీ 15 వేల కుటుంబాలు గుడిసెల్లోనే..
  5. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం 
  6. జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలను మార్క్‌ఫెడ్‌లో విలీనం 
  7. క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో రెండో విడతలో 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2వేల గృహా లను కేటాయించాలని నిర్ణయించింది.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూ రు చేసే కార్యక్రమాన్ని జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌కాగజ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో లక్ష ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణం, గోదావరి పుష్కరాలకు రూ.1,000 కోట్ల కేటాయిం పు, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.587 కోట్ల ఆమోదం వంటి నిర్ణయాలతో పాటు తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దే నూతన పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

శని వారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన మీడియాకు వెల్లడించారు. సొంత ఇల్లు లేని పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 

మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రెండో దశలో మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు.

వేలాది కుటుంబాలు సంవత్సరాలుగా అసంపూర్తి ఇళ్లతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పునాదులు పూర్తు గోడలు, శ్లాబ్ దశకు రాని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తు శ్లాబ్ దశలో నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 

గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యం..

మొదటి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2 నాటికి దాదాపు లక్ష ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నామన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం ప్రభుత్వం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ప్రారంభించనున్నట్టు మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల ప్రజల కోసం లక్ష ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, నగరంలో పెరుగుతున్న అద్దెల భారం, సొంత ఇళ్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మధ్యత రగతి, అల్పాదాయ వర్గాలకు అందుబాటు ధరల్లో గృహాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నామని, మెట్రో, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులతో ఈ గృహాలను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో నిర్వహించిన సర్వేల ప్రకారం సుమారు 15 వేల కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లో నివసిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, వెంటనే ఆ కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని క్యాబినెట్ నిర్ణయించామన్నారు. గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. 

విద్యుత్ వ్యవస్థ బలోపేతం

 కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్ డీఎస్‌ఎస్‌లో తెలంగాణ డిస్కంలు చేరేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ పథకం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, లైన్ నష్టాలను తగ్గించడం, ఆధునిక సాంకేతికత వినియోగం, సబ్స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నామని, దీని వల్ల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్   అందుతుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. 

జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా.. 

ప్రభుత్వ పాఠశాలల తరహాలో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని, ముఖ్యంగా పేద కుటుంబాల విద్యార్థులు చదువు మానేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని  తెలిపారు.

పోషకాహార లోపం తగ్గి, విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని అంచనా వేస్తోందని, రాష్ట్రంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. అలాగే తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను హాకాలో విలీనం చేయడం ద్వారా పరిపాలనా ఖర్చులు తగ్గి, వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు.

‘పాలమూరు సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం..

పాలమూరుసంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ, పునరావాసం, మౌలిక వసతుల కల్పన కోసం రూ.587 కోట్ల నిధులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సాగునీరు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. 

లైఫ్ సైన్సెస్ పాలసీకి ఆమోదం..

2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్- లైఫ్ సైన్సెస్ హబ్‌లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో నెక్ట్స్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026 క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 

ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్, డిజిటల్ హెల్త్ రంగాల్లో తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చాలని సంకల్పించిందని, ఇప్పటివరకు తయారీ రంగంపైనే ఎక్కువ దృష్టి ఉండగా, ఇకపై ఇన్నోవేషన్, పరిశోధన, అధునాతన సాంకేతికతలపై ఎక్కువ ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు.

ఆర్ అండ్ డీ యూనిట్లను పరిశ్రమలుగా గుర్తించేలా కొత్త విధానంలో మార్పులు తీసుకొస్తోందని, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లను తెలంగాణకు ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. 

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, ఆరు నాన్ టీచింగ్ పోస్టులు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 3 పోస్టులు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరు చేయడంతోపాటు అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. 

గోదావరి పుష్కరాలకు నిధులు..

వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసిందని, ఇందుకు రూ.1000 కోట్ల నిధులకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. తొలి విడతగా రూ.300 కోట్లు విడుదల చేసి పుష్కర ఘాట్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత, పార్కింగ్, వైద్య శిబిరాలు వంటి ఏర్పాట్లను విస్తృత స్థాయిలో చేపట్టనున్నామని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.

క్యాబినెట్ నిర్ణయాలు..

* రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజక  వర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున అందిస్తాం. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు  నియోజకవర్గానికి 500 ఇళ్లకు చొప్పున నిధులు కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానించింది. 

* హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం (ఎల్‌ఐజీ) లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. 

* రాష్ట్రంలో వివిధ దఫాలుగా చేసిన సర్వేల ప్రకారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం       గుర్తించింది. వెంటనే ఆ కుటుంబాలన్నింటికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. 

* వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులు చేపట్టేందుకు రూ.1,000 కోట్ల నిధులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

* విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్‌డీఎస్‌ఎస్‌లో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. 

* రాష్ట్రంలోని అన్ని  జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

* రాష్ట్రంలోని డీసీఎంఎస్‌లను మార్క్ ఫెడ్‌లో విలీనం చేయాలని, తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హాకాలో విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. 

* పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు రూ.587 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

* తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే ‘నెక్ట్స్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30’ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.