24 May, 2026 | 2:19 AM

కన్న వారికి వైద్యం వద్దా?

24-05-2026 01:12 AM
  1. ఆర్టీసీ కార్మికుల తల్లిదండ్రులకు రిఫరల్ ఆస్పత్రుల్లో వైద్యం మిథ్యే 
  2. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల తల్లిదండ్రులకూ అందుతున్న వైద్యం 
  3. ఆ భారం మోయలేమంటున్న ఆర్టీసీ యాజమాన్యం!

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేరు.. టీజీఎస్ ఆర్టీసీలో పనిచేసే ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌లు వేరు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రు లకు రిఫరల్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుతుంటే, ఈ సదుపాయం ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించదు. కొన్ని దశాబ్దాలుగా ఆర్టీసీ కార్మికుల తల్లిదండ్రులకు ప్రైవేట్ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందడంలేదు.

ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు హెల్త్ కార్డు మీద ప్రైవేట్‌లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నప్పుడు.. ఆర్టీసీలో మాత్రం ఎందుకు ఇది అమలు కావడంలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇతర ఏ ప్రభుత్వ విభాగంలో లేనంతగా ఇక్కడ మాత్రం అందని  పరిస్థితి నెలకొంది.

కనీ.. పెంచి.. చదివించి.. ఓ ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రులకు.. ఆ కొడుకు లేదా కూతురు ఉద్యోగం ద్వారా హెల్త్ కార్డుపైన వైద్యం పొందే అవకాశం లేకపోవడం దారుణమని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో వచ్చే రోగం, నొప్పికి కూడా వైద్యం ఇప్పించలేని పరిస్థితిలో ఆర్టీసీ కార్మికులున్నారు. 

అక్కడ చిన్నాచితక వాటికే చికిత్స..

రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థలో 37,360 మంది ఉద్యోగులుండగా, విశ్రాంత ఉద్యోగులు 9,600 మంది వరకు ఉంటారు. ఆర్టీసీ కార్మికులకు ఏదైనా జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు వస్తే  జిల్లాల్లోని ఆర్టీసీ డిస్పెన్సరిల్లో వైద్య సేవలు పొందాల్సి ఉంటుంది. అక్కడ వైద్య సేవలు అందుబాటులో లేనప్పుడు హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ అందుబాటులో లేని వైద్య సేవలకు, ఏమైనా సీరియస్ కేసులు, తీవ్ర అనారోగ్య సమస్యలుంటే కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది.

అది కూడా ఇక్కడి తార్నాక ఆస్ప త్రి వైద్యులు రెఫర్ చేస్తేనే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలి. కేవలం ఉద్యోగులు, వారి భర్త లేదా భార్య, పిల్లలకు మాత్రమే ఈ సేవలు అందుతాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు రెఫరల్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలే అందవు. తల్లిదండ్రులకు కూడా తాము వైద్యం అం దించలేని దీనస్థితిలో ఉన్నామని ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

భారం మోయలేమంటున్న ఆర్టీసీ..

1989, 1990లో ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వైద్య సేవలు అందే పరిస్థి తి ఉండేదని యూనియన్ నేతలు చెప్తున్నా రు. సంస్థ కోసం ఎంతో కష్టపడే ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల తల్లిండ్రులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముందుకు రాకపోవడం చాలా దారుణమనే విమర్శలు వస్తున్నాయి. ఒకవైపేమో.. సీఎం రేవంత్‌రెడ్డి తల్లిదండ్రు ల సంరక్షణ, యోగక్షేమాల కోసం ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్ష ణ బిల్లు-2026’ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

కానీ అదే ఆర్టీసీలో మాత్రం తల్లిదం డ్రులకు అందించే వైద్యంపట్ల వివక్ష చూపుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కాకుండా ఇతర విభాగాల్లో పనిచేసే మిగతా టీచర్లు, ఉద్యోగుల హెల్త్ కార్డులపై తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయి.

ఏడాదికి ప్రతి ఉద్యోగి నుంచి ఎంతో కొంత నిధులు కట్ చేసుకుని ఆ డబ్బులను కార్మికుల తల్లిదండ్రుల వైద్యానికి ఉపయోగి స్తామనే ప్రతిపాదనను ఆర్టీసీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ఆర్టీసీ కార్మిక సంఘా లు కూడా అంగీకారం తెలుపుతున్నా.. దీనిపై ఆర్టీసీ యాజ మాన్యం త్వరితగతిన నిర్ణయం తీసుకోకుండా నాన్చే ధోరణిలో ఉన్నట్లుగా ఆరోప ణలున్నాయి.

ఆర్టీసీ సంస్థనే వైద్యం అందించాలి.. 

ఆర్టీసీ సిబ్బంది పేరెంట్స్‌కు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో(రెఫరల్) ఆర్టీసీ సంస్థ, ప్రభుత్వమే వైద్యం అందించాలి. ప్రైవేట్ కంపెనీలు ఆయా ఉద్యోగి తల్లిదండ్రులకు కూడా వైద్య సేవలు అందిస్తుంటే, టీజీఎస్ ఆర్టీసీలో మాత్రం ఈ సదుపాయం లేకపోవడం దారుణం. మేం ఏం పాపం చేశాము. అలాగే సుదూర ప్రాంతాల్లోని డిపోల్లో పనిచేసే సిబ్బందికి ఆయా జిల్లాల్లోని కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలను అందించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య చికిత్స నిమిత్తం కేవలం రూ.4 లక్షలకే పరిమితం చేయకుండా ఎంత ఖర్చయినా ఆర్టీసీ సంస్థే భరించాలి.

 ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ చైర్మన్

పేరెంట్స్‌కు ఎందుకు ఉండదు?

తమను ఇంతవాడిని చేసిన తల్లిదండ్రులకు ఏమైనా పెద్ద అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వారిని కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. భార్య పిల్లలకు అమలవుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఎందుకు ఉండకూడదు. తమ కార్డుపైన మాకు అనారోగ్య సమస్యలొస్తే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొడుకు/కూతురు చూపించడంలేదని వారు అనుకునే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏడాది ఎంతో కొంత తమ వేతనాల నుంచి కట్ చేసుకుని తల్లిదండ్రులకు కూడా వైద్యం అందించే ప్రతిపాదనపై ఆర్టీసీ యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

 నరేందర్, ఆర్టీసీ ఎన్‌ఎంయూ నాయకులు