హత్తుకునే ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’
తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇటీవల కాలంలో అత్యంత ఆదరణ పొందిన నవలల్లో రవి మంత్రి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ ఒకటి ఈ నవల అమ్మతనపు అప్యాయత, అనురాగాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఒక స్త్రీ తన వ్యక్తిగత ఆశలను, కలలను కుటుంబ బాధ్యతల కోసం ఎలా త్యాగం చేసిందనే అంశాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తుంది. అమ్మ అనే పదం వింటే, మనపై ఆమె ప్రేమ మాత్రమే గుర్తొస్తుంది కానీ, అమ్మకు కూడా ఒక మనసుంటుందని, సొంత ఆశలు ఉంటాయనేది ఎవరికీ, పెద్దగా పట్టింపు లేని అంశం.
అలాం టి సున్నితమైన అంశాలను చర్చిస్తూ, మంచి నవల రాశారు రవి మంత్రి. అందుకే.. ఈ నవల అమ్మ స్వేచ్ఛపై, ఆమె అంతర్మథనంపై వచ్చిన అరుదైన రచనల్లో మేటిగా నిలిచింది. నవల బెస్ట్ సెల్లర్‌గా నిలవ డానికి ప్రధాన కారణం, నవలలోని సహజత్వం. 80ల నాటి స్వచ్ఛమైన ప్రేమకథను నేటితరానికి అర్థమయ్యే రీతిలో, అంతే గాఢతతో రచయిత అందిం చారు. ఎటువంటి కల్మషం లేని ఆనాటి భావోద్వేగాలు నేటి పాఠకులను సైతం కట్టిపడేస్తాయి.
పాఠకు డు నిజంగా ఓ తల్లి డైరీని చదువుతున్న అనుభూతిని నవల పాఠకులకు అందిస్తుంది. ఆ డైరీ పేజీల్లోని ప్రతి అక్షరం ఒక వేదనను, ఒక మధుర జ్ఞాపకాన్ని మోసుకొస్తుంది. అందుకే ఈ పుస్తకం భాషల సరిహద్దులను చెరిపేస్తూ హిందీ, గుజరాతీ, మరాఠీ వంటి ఇతర భాషల్లోకి అనువాదమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారితో పాటు, మానవ సంబంధాలను ప్రేమించే ప్రతి పాఠకుడి మనసును నవల తాకుతున్నది.
నవలాంశమిది
కథానాయిక సారిక, కథానాయకుడు అభిరామ్ ఒకే కళాశాలలో చదువుకునే ఇంజినీరింగ్ విద్యార్థులు. వీరిద్దరి మధ్య చిగురించిన స్వచ్ఛమైన ప్రేమ.. తర్వాత కుటుంబ పరిస్థితుల కారణంగా పెళ్లి వరకు వెళ్లదు. అప్పటి సామాజిక కట్టుబాట్లు, ఆచారాలు వారిని వేర్వేరు మార్గాల్లో నడిపిస్తాయి. పరిస్థితులకు లొంగిపోయి సారిక మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. బాధ్యతాయుతమైన భార్యగా, ప్రేమగల తల్లిగా సారిక తన జీవితాన్ని కుటుంబం కోసం అంకితం చేస్తుంది.
ఏళ్ల తర్వాత, తన పిల్లలతో నిండిన సంసారంలో నిమగ్నమై ఉన్న సారికకు, గతం తాలూకు జ్ఞాపకాలు మళ్లీ ఎదురవుతాయి. తన జీవితంలో వదులుకున్న ఆ పాత ప్రేమికుడు అభి రామ్‌ను తిరిగి కలిసినప్పుడు, ఆమె మనసులో తలెత్తే సంఘర్షణే నవల కథాంశం. అమ్మతనపు ఆశలను, ఆవేదనను సారిక పాత్ర ద్వారా రచయిత కళ్లకు కట్టినట్లు చూపారు. ఒక స్త్రీ వివాహం తర్వాత తన ఉనికిని కుటుంబానికి ఎలా అంకితం చేస్తుందో ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది. అభిరామ్ పాత్ర మగవారి దృక్పథంలో ఉండే బాధ్యతాయుతమైన ప్రేమ ను తెలియజేస్తుంది.
సారిక, అభిరామ్ మధ్య సాగే సంభాషణలు, వారి మధ్య జరిగిన సంఘర్షణలు పాత్రల ఔచిత్యాన్ని చాటిచెబుతాయి. నందగోపాల్ పాత్ర కుటుంబ వ్యవస్థలోని బాధ్యతలను సూచిస్తుంటే, సుచిత్ర, గీతాంజలి, అభిజిత్ వంటి పాత్రలు కథలోని లోతును పెంచుతాయి. ప్రతి పాత్రకు ఒక నేపథ్యం, ఒక ఉద్దేశం ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండటం, ఒకరికోసం ఒకరు త్యాగం చేసు కోవడం వంటి అంశాలు తెలుగు సంస్కృతిని, కు టుంబ విలువలను ప్రతిబింబిస్తాయి.
కొత్త దృక్కోణం ఆవిష్కరణ
సారిక తన పిల్లల కోసం, కుటుంబం కోసం తీసుకున్న నిర్ణయాలు, ఆమె పడిన సంఘర్షణ ప్రతి పాఠకుడిని తన సొంత జీవితంలోని సన్నివేశాలతో పోల్చుకునేలా చేస్తాయి. నవలలోని కథనం పాఠకుడిని ఒక మంత్రముగ్ధమైన ప్రపంచంలోకి తీసుకె ళ్తుంది. ప్రతి పేజీ ఒక కొత్త మలుపును, మరో కొత్త భావోద్వేగాన్ని పరిచయం చేస్తుంది. ఒక స్త్రీ తన యవ్వనంలో వదులుకున్న ప్రేమికుడిని మళ్లీ కలిసినప్పుడు ఆమె మనసులో తలెత్తే అలజడిని, బాధ్యతకు, ప్రేమకు మధ్య జరిగే యుద్ధాన్ని రవి మంత్రి నైపుణ్యంతో చిత్రించారు.
మాతృత్వపు గొప్పతనాన్ని చాటిచెబుతూనే, స్త్రీలోని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన తీరు అభినందనీయం. తెలుగు నవలలంటే కేవలం పాత కాలపు కట్టుబాట్లు మాత్రమే అని భావించే వారికి, ఆధునిక భావోద్వేగాల మేళవింపుతో ఈ నవ ల ఒక కొత్త దృక్కోణాన్ని అందిస్తుంది. చివరిగా చెప్పాలంటే, ఈ నవల ప్రతి పాఠకుడికి ఒక మధురమైన, విషాదకరమైన అనుభూతిని మిగల్చడం ఖాయం.
(ప్రతులు అన్ని ఆన్‌లైన్ స్టోర్లలో లభ్యం)
చిటికెల రాంప్రసాద్
96430 86121




