గాజులమ్మ గాజులు!
భుజాన బరువైన మూట
నాయనా! చూద్దామంటే
ఇంటింటి కాడా దించేది
మూటవిప్పగానే
బొండుమల్లెల్లా ముచ్చటగొలిపె
కార్యమేదైనా
ఆ చేతుల గాజులు జాబిలి నవ్వులు
నగలెన్నున్నా గాజుల తర్వాతే....
పొట్లాలు పొట్లాలుగా
మట్టి గాజులు,లక్కగాజులు
రబ్బరు గాజుల,బంగారు గాజులు
బ్లాక్ మెటల్ ,నీలం రంగు గాజులు
పాలపిట్ట గాజులు
జాగ్రత్తమ్మా జాగ్రత్త!
గాజులు పగిలిపోతాయి తల్లి
పెళ్లి పందిట్లో సంబురాలు హంగామాలు
అమ్మమ్మలు నాయనమ్మలు
మేనత్తలు అక్కలు, చిన్నమ్మలు ఆడబిడ్డలు
వదినే మరదళ్లు ఇయ్యపు
రాళ్లందరూ అలంకరించుకుంటారు
అందాలనిచ్చిన గాజుల గురించి
చేతులు సరదాగా మాట్లాడుకుంటాయి
గాజులు తొడుగుతుంటే
వెలుగులను కంకణాలుగా
వేసుకున్నట్లుండేది
చిన్నచిన్నగాజులు
పెద్దపెద్ద చేతులను మురిపిస్తాయి
ఎంత మొరటుచెయ్యయినా
పూలకాడ లాగా ఒదిగిపోతది
భూమి ఆకుపచ్చదనాన్ని తొడుకున్నట్లు
వయసు ముడతలు పడ్డా
గాజులను వేసుక్కుంటూనే ఉన్నారు!
చిన్నారులకు పూలపూల గోట్లు
గాజులంటే గంతులేస్తరు
వెన్నెలనిష్టపడ్డట్లు
గాజులంటే పంచప్రాణాలు
బీరువా నిండా గాజులున్నా
చీర రవిక మ్యాచింగ్ లా...
ప్రతి ముచ్చటకు
మురిపెంగా కొత్త గాజులే
జాతర్లలో గాజుల గుడారాలు
సమ్మక్క సారక్క గాజులు
పోశమ్మ ఈదమ్మ గాజులు
సీతమ్మ,, లక్ష్మీగాజులు
తీరికలేని పనులెన్నున్నా
తిరునాల పోవాలె గాజులేసుకోవాలె...
గాజులేస్తుప్పుడల్లా
సున్నితమైనవి పగిలిపోతుంటాయి
ముక్కలైనప్పుడల్లా మనసు
కలుక్కుమంటాది బేరం కాడ
ధరలను కొసురుతారు కానీ
ముక్కలైన బాధను దిగమింగుతూ
చిరునవ్వు
ఒక్కొక్కసారి అమ్ముకున్న
సంతోషం కన్నా
పగిలిన గాజుల బాధే ఎక్కువవుతుంది
పట్నం గాజులు
పడుచు పిల్లల చూపుల్లో
మెరుపు కలలు
ఒక్కొక్క గాజు ఒక్కొక్క వన్నె
విభిన్న కోరికలు
అద్దాలకన్నా సున్నితం
తీరొక్క వర్ణాలు పొదిగినందుకేమో
చార్మినారు
ఒక చేతిని గాజుల బజారుకిచ్చింది
అందుకేనేమో
కవికోకిల సరోజిని
బ్యాంగిల్ సెల్లర్స్ కవిత రాసింది !
వనపట్ల సుబ్బయ్య




