10 March, 2026 | 9:30 AM

రస హృదయ ‘మేఘరాగ రంజని’

09-03-2026 01:58 AM

అపురూపమైన కవితలతో రస హృదయుల మనసు దోచే విధంగా ‘రఘువర్మ’ (డాక్టర్ టి.లక్ష్మీనారాయణ) ‘మేఘరాగరంజని’ కవితా సంపుటి వెలువరించారు. కవి తన కవితల డోలికల్లో లోతైన అనుభూతుల్లో ముంచేస్తారు. మం త్రముగ్ధమైన ప్రణయ సామ్రాజ్యంలోకి తీసుకెళ్తారు. తెలుగు భాషా సొగసుపై అద్భుతమైన పట్టున్న ఈ కవి, ప్రతి పదానికీ ప్రాణం పోస్తూ, భావప్రకటనలో నూతన ఒరవడిని సృష్టించారు. ఈ కావ్యం కేవలం కవితల కూర్పు మాత్రమే కాదు, ఒక అజ్ఞా త ప్రేమికుడి అంతరంగ ఆవిష్కరణ అని చెప్పవచ్చు.

తన ఊహాసుందరిని అక్షరాల్లో నిక్షిప్తం చేస్తూ ఆమెను అమరత్వ దేవతగా ప్రతిష్ఠించిన తీరు అద్భుతం. ఈ కవితలు చదువుతుంటే జాన్ కీట్స్ తన ప్రేయసి ఫానీ బ్రౌన్‌కు రాసిన గాఢమైన ప్రేమ లేఖలు గుర్తుకువస్తాయి. కవి తన ఊహల్లోని ప్రేయసిని వర్ణిస్తూ ‘నీ ఊహ నాకు తోడుంటే చాలు ఆకాశమంత ఊపిరిని నా ఉత్సాహంగా పీల్చుకుంటా’ అనడంలో ఆయన భావనాశక్తి కనిపిస్తుంది. ‘నీ చెక్కిళ్లసొట్టల సుందర సుడిగుండాల్లో సూక్ష్మరూపుడనై పడిపోయి గిరగిరా తిరిగి రావాలనిపిస్తుంది’ అన్న పంక్తుల్లో సున్నితమైన రస దృష్టి, అలంకారిక శైలి ఉట్టిపడుతున్నాయి.

‘ఆరాధన’ కవితలో ‘నీ సౌందర్యమనెడు సూర్యుడి ముందు నేనొక ప్రొద్దుతిరుగుడు పూవునౌతాను’ అని పేర్కొంటూ ప్రేయసి పట్ల తనకున్న అనన్యమైన భక్తిని ప్రకటించారు. ప్రకృతిలోని అంశాలను ప్రేయసి రూపంతో పోలుస్తూ ‘తరళాక్షి’ కవితలో ఆమె కళ్లను ‘నిరంతరం మెరుపులను సృష్టించే విద్యుత్ కేంద్రాలు’గా అభివర్ణించడంలో ఉత్ప్రేక్షా అలంకారం అత్యంత సహజంగా అమరింది. ‘గులాబీలు’ కవితలో ‘నీ సౌందర్యం చూసిన తర్వాతే అవి సిగ్గుపడి ఎర్రబడ్డాయి’ అని వర్ణించడం కవి సృజనాత్మకతకు నిదర్శనం. ‘హృదయ సామ్రాజ్ఞి’ కవితలో ఆమెను ‘ప్రణయవర్షాన సౌదామిని’గా, ‘యవ్వన సరసిలో మరాళము’గా అభివర్ణిస్తూ ప్రణయానికి ఒక పవిత్రతను చేకూర్చారు.

ఈ కవిత్వంలో అలంకారాల వినియోగం, ఉపమానాల ఎంపిక అత్యంత సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. ‘నీ చెక్కిళ్ల సొట్టల సుందర సుడిగుండాల్లో సూక్ష్మరూపుడనై పడిపోయి గిరగిరా తిరిగి రావాలనిపిస్తుంది’ అన్న వాక్యాల్లో కవి రస దృష్టి ఎంతటి లోతైనదో అర్థమవుతుంది. ‘ఓ మనోహారీ! శృంగార రసఝరి! నా గుండె కొండ లోయల్లో పరుగులెత్తే... స్మృతుల జలపాతం నీవు !’ అంటూ ప్రేయసిని జలపాతంతో పోల్చిన తీరులో ఒక నిరంతర ప్రవాహం వంటి ప్రేమ కనిపిస్తుంది. తన బతుకు అనే ప్రశ్నకు ఆమెనే సమాధానంగా చిత్రించి, ప్రేమే సర్వస్వం అని చాటిచెప్పారు. ప్రకృతిలోని అంశాలను ప్రేయసి రూపంతో మిళితం చేయడంలో రఘువర్మ సిద్ధహస్తులని ‘తరళాక్షి’ కవిత నిరూపిస్తుంది.

ఆకాశంలో మేఘాల సంఘర్షణ వల్ల మెరుపులు పుడితే, ఏ మేఘాలూ లేకున్నా నిరంతరం మెరుపులను సృష్టించే విద్యుత్ కేంద్రాలు ఆమె రెండు కళ్లని వర్ణించిన విధానం అపూర్వం. ‘నీ రెండు కళ్లు! అవి ఏ ఉరుముల హెచ్చరికలు లేకుండానే మెరుపుల మెరుపుదాడి చేస్తూ... నా గుండెను తీయతీయగా ’జిల్ జిల్’ మన్నిస్తుందని అనడంలో ఉత్ప్రేక్ష అలంకారం ఉట్టిపడుతుంది. భావానికి అనుగుణంగా పదాల ఎంపికలో చూపే మాధుర్యం, శబ్దాలంకారాల మెరుపులు పాఠకుడికి సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ కవితా సంపుటిలో ప్రేయసి పట్ల కవికి గల ఆరాధనా భావం ప్రతి అక్షరంలోనూ ప్రతిబింబిస్తుంది.

'నీ సౌందర్యమనెడు సూర్యుడి ముందు నే నొక ప్రొద్దుతిరుగుడు పూవు నౌతాను !’ అన్న వాక్యాల్లో తన అస్తిత్వాన్ని పూర్తిగా ఆమెకే అంకితం చేసిన భక్త కవి కనిపిస్తాడు. అలాగే ’గులాబీలు’ కవితలో ‘ఎర్ర గులాబీల అసలు రంగు తెలుపు! కానీ- నీ సౌందర్యం చూసిన తర్వాతే అవి సిగ్గుపడి ఎర్రబడ్డాయి!’ అనడం కవి ఊహాశక్తికి పరాకాష్ట. ఇక్కడ ప్రకృతి సహజత్వాన్ని సైతం ఆమె అందం ముందు తలవంచేలా చేసిన అతిశయోక్తి అలంకారం పాఠకులను పరవశింపజేస్తుంది. జాన్ కీట్స్ తన ప్రేయసి ఫానీ బ్రౌన్కు రాసిన ఉత్తరాలలోని గాఢత రఘువర్మ కవిత్వంలోనూ ధ్వనిస్తుంది.

మొత్తంగా చెప్పాలంటే, రఘువర్మ కవితల్లోని పదాలాలిత్యం, సుందర సుకుమార భావాలు ’మేఘరాగరంజని’ని ఒక విశిష్టమైన ప్రేమ కావ్యాంగా తీర్చిదిద్దాయి. తన మదిలోని అంతర్లీన దృశ్యాలను, అస్పష్ట అనుభూతులను అమూర్త భావాల నుంచి మూర్త ప్రతీకలుగా మలచడంలో కవి విజయం సాధించారు. ‘నీవు నాకు కనిపిస్తే చాలు నా బాధలన్నీ ఉరి పోసుకుంటాయి’ అన్న వ్యక్తీకరణలో ఎంతటి గాఢమైన ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. ఈ కావ్యం చదువుతుంటే నిష్కల్మషమైన ప్రేమలోని మాధుర్యం, సున్నితత్వం పాఠకుల మనసులను తాకుతాయి. రసజ్ఞులైన పాఠకులు తప్పక చదవాల్సిన అద్భుతమైన కవితల సమాహారం ఇది.

నిమ్మల రామలింగం

97034 41010