11-02-2026 02:57:41 AM
రంగారెడ్డి, ఫిబ్రవరి౧౦ (విజయక్రాంతి): జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. మొత్తం 126 వార్డుల్లో కౌన్సిలర్లను ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,75,974 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఇక్కడ ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఆమనగల్లులో 15 వార్డులు, 30 పోలింగ్ స్టేషన్లు, ఓటర్లు 8,475(పురుషులు) (8,509) మహిళలు, ఇబ్రహీంపట్నం లో 24 వార్డులు, 48 పోలింగ్ స్టేషన్లు,(12,741) పురుషులు,(13,252). మహిళలు, షాద్ నగర్ లో 28 వార్డులు, (76) పోలింగ్ స్టేషన్లు,(26,679) పురుషులు,(26,723) మహిళలు, శంకర్పల్లి లో 15 వార్డులు(31) పోలింగ్ స్టేషన్లు,(10,551) పురుషులు,(10,850) మహిళలు, చేవెళ్ల లో 18 వార్డులు,(37) పోలింగ్ స్టేషన్లు, (12,579) పురుషులు,(12,791) మహిళలు, మొయినాబాద్ లో 26 వార్డులు,(52) పోలింగ్ స్టేషన్లు, (16,419)పురుషులు,16,402(మహిళలు ) ఉన్నారు.
చైర్మన్ పీఠాల రిజర్వేషన్లు ఇలా..
మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేసింది. మొయినాబాద్ లో ఎస్సీ (జనరల్) షాద్‌నగర్‌లో బీసీ (జనరల్) శంకర్పల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు లో జనరల్ కేటగిరీ కి కేటాయించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సమయం కేటాయించారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా, తమ అమూల్యమైన ఓటును వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.