22 May, 2026 | 4:38 AM

ఈ దారికి వాహనాలు వస్తేనే వెలుగులు

22-05-2026 01:58 AM
  1. అంధకారంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎర్రవల్లి రహదారి
  2. జనావాసంలోనూ వెలుగులు కరువు 
  3. పొంచి ఉన్న ప్రమాదం

గజ్వేల్, మే 21: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్న సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎర్రవల్లి ప్రధాన రహదారిలో వాహనాలు వస్తేనే వెలుగు ఉంటుంది. ఆర్ అండ్ ఆర్ కాలనీ మొత్తం అంతర్గత రహదారులలో విద్యుత్ స్తంభాలు, ఎల్‌ఈడి విద్యుత్ దీపాలు  ఏర్పాటు చేయడంతో వెలుగులతో మెరిసిపోతుంటుంది. కానీ కాలనీలోని ఎర్రవల్లి, సింగారం ప్రధాన రహదారిలో మాత్రం విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలు లేకపోవడంతో గ్రామస్తులు, రహదారి నుండి గజ్వేల్ - గౌరారం వెళ్లే  వాహనదారులకు ఇబ్బందిగా మారింది.

చీకట్లో రహదారిపై కాలినడకన వెళ్లే వారికి భద్రత లేకుండా పోయింది. ఇదే ప్రాంతంలో ఉన్న మూలమలుపు చివరి వరకు వస్తే గానీ వాహనాలపై ఉండే వారికి కాలినడకన వెళ్లేవారు కనబడరు. దీంతో పలుసార్లు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. కాలనీ ఏర్పాటై సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రధాన రహదారిపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు చీకట్లో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని భయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం ప్రజల ఇబ్బందిని పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎర్రవల్లి ప్రధాన రహదారిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా మార్చాలని కోరుతున్నారు.