ఈ పెట్రోల్‌ను నిషేధించాలి
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలి
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్
ముషీరాబాద్, జూలై 29(విజయక్రాంతి): ఈ-20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల దేశంలోని మోటారు వాహనాలకు తీవ్ర నష్టం జరుగుతోందని, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెంటనే రాజీనామా చేయాలని దళిత బహుజన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్, జాతీయ చీఫ్ అడ్వైజర్ డా. వి.ఎల్. రాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ ప్రసాద్ మాదిగ, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జె.ఎన్. రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాయప్ప పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ ఈ-20 పెట్రోల్ వినియోగం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, మైలేజీ సుమారు 20 శాతం వరకు తగ్గుతోందని ఆరోపించారు. సాధారణ పెట్రోల్కు బదులుగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ను మార్కెట్లోకి తీసుకువచ్చి, కేంద్ర ప్రభుత్వం ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని విమర్శించారు. కుటుంబ వ్యాపార ప్రయోజనాల కోసమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ-20 పెట్రోల్ విక్రయాలను వెంటనే నిషేధించాలని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆగస్టు1న ఢిల్లీలో కేజ్రీవాల్, ఈ-20 జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ సదస్సులో దళిత బహుజన పార్టీ తరఫున పాల్గొని ఈ అంశంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.






