25 June, 2026 | 2:45 AM

మూసిన బడిని తెరిపించారు

25-06-2026 01:34 AM

కేసముద్రం, జూన్ 24 (విజయక్రాంతి): బడి ఈడు కలిగిన పిల్లలు గ్రామంలో ఉన్నప్పటికీ కొందరు ప్రైవేటు పాఠశాలకు, ఇంకొందరు కోమటిపల్లి పాఠశాలకు పంపించడంతో గత ఏడాది ఇనుగుర్తి మండలం పాత తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మూసివేతకు గురైంది. ఈ క్రమంలో గ్రామానికి కొత్తగా సర్పంచ్ గా ఎన్నికైన ఇస్లావత్ నరేష్ తిరిగి పాఠశాల ప్రారంభానికి నడుం బిగించారు.

తమ గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాల వాహనాలు రాకుండా తీర్మానించారు. ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సులు గ్రామంలోకి వస్తే 5000 రూపాయల జరిమానా విధిస్తామని ఏకంగా గ్రామ పొలిమేరలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దీనికి తోడు తమ గ్రామంలో బడి ఈడు కలిగిన పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివించడం వల్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదని, నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు విద్యా బోధన చేస్తారని, ప్రభుత్వ పాఠశాలకు పిల్లల్ని పంపించకపోతే బడి శాశ్వతంగా మూతపడుతుందని, ఫలితంగా భవిష్యత్తులో పాఠశాల కావాలంటే ఇబ్బంది పడక తప్పదని గ్రామస్తులను ఒప్పించాడు. దీనితో గత వారం రోజుల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంతకాలం మూసివేతకు గురైన పాఠశాల ఇప్పుడు విద్యార్థులు రాకతో కళకళలాడుతోంది. 

ప్రభుత్వ బడిలోనే చదివిస్తాం

గ్రామంలో బడి ఈడు గల పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చేర్పించి, చక్కగా చదివిస్తామని సర్పంచ్ ఇస్లావత్ నరేష్ తెలిపారు. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి తమ గ్రామంలో మంచి పాఠశాల భవనం నిర్మించడంతోపాటు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించిందన్నారు. కేవలం పిల్లలు తరచుగా ఇంటికి వస్తారని, అందుకే చాలామంది పిల్లల్ని తమ తల్లిదండ్రులు ప్రైవేటు, ఇతర గ్రామాల్లోని పాఠశాలలకు పంపిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తమ పాఠశాలలోనే పిల్లలను పాఠశాల సమయం పూర్తయ్యేంత వరకు ఉంచి, ఇంటికి పంపకుండా విద్యాబోధన చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.